ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక పరీక్ష’
● పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై ఆదేశాలు
● ఆలస్యంగా ఉత్తర్వులు వెలువరించడంపై ఆవేదన
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మూడు రోజుల కిందట విడుదల చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయుల ఆవేదనకు దారి తీస్తున్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేవరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించడంపై ఉపాధ్యాయ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేసవి సెలవుల్లో విహారయాత్ర, తీర్థయాత్రలకు వెళ్లేందుకు పలువురు ఉపాధ్యాయులు కొన్ని నెలల కిందటి నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం గతంలోని లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక తరగతులపై ఆదేశాలు జారీ చేయడం, అదికూడా ముందస్తుగా కాకుండా వేసవి సెలవుల అయిన ఏప్రిల్ 23 తర్వాత ఉత్తర్వులు విడుదల చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సెలవులు వినియోగించుకుంటే ఈఎల్‌సి మంజూరు చేయడం పరిపాటి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈఎల్‌సీ ప్రస్తావన లేదు. దీనిపైన కూడా ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. అందుబాటులో ఉన్న పలువురు ఉపాధ్యాయులు బోధన కోసం పాఠశాలలకు వెళ్లినా కొన్ని పాఠశాలల్లో ఒకరిద్దరు హాజరువుతుండటం, మరికొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడం తలనొప్పిగా మారింది. విద్యార్థులకు ఫోన్‌లు చేసినా వారు తరగతులుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తరగతులు బోధించినపుడు ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉండగా, విద్యార్థులు హాజరుకాని సందర్భంలో ఏం చేయాలో పాలుపోక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
గతంలో ఎన్నడూ లేదు
ఈఎల్‌సీలు ఇవ్వకుండా ఉపా ధ్యాయుల సేవలు వినియోగించుకున్న సందర్భాలు గతంలో లేవు. సప్లిమెంటరీ పరీక్ష మరో పది రోజులుండగా, ఇప్పుడు ప్రత్యేక తరగతులపై ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ప్రభుత్వం తీసు కుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటుంది. – పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ నాయకుడు


