ఇంట్రస్ట్ ఉందా.. లేదా..?
● అరసవల్లిలో ట్రస్ట్ బోర్డు నియామకాలెప్పుడో..?
● గడువు ముగిసి 120 రోజులు దాటినప్పటికీ కానరాని ఆదేశాలు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి పాలకమండలి సభ్యుల నియామకానికి ఇంకా గ్రహణం వీడలేదు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నింటికీ ట్రస్ట్ బోర్డులను నియమించేలా ఆదేశించిన ప్రభుత్వం అరసవల్లి ఆలయ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి రాజకీయాల నడుమ స్థానిక ఎమ్మెల్యే మంత్రుల చొరవతో ఇంకా ఈ ట్రస్ట్ బోర్డు నియామకాలకు లెక్కలు తేలలేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు కూడా ముగిసి వందరోజులు దాటినప్పటికీ.. ఇంతవరకు పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. ఈ నియామకాల ఉత్తర్వులు ఎప్పుడెప్పుడొస్తాయో అని తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ కీలక కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
‘ట్రస్ట్’ రికార్డు లేని టీడీపీ
టీడీపీ గతంలో రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టినప్పటికీ అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్‌తో పాటు నియామకాలను చేపట్టడం విషయంలో ఎప్పుడూ వెనుకడుగే కనిపించింది. గత రికార్డులను పరిశీలిస్తే అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డును నియమించలేదు. అలా గే గత 2014–19లోనూ, స్థానికంగా ట్రస్ట్ బోర్డు నియామకానికి చెందిన నోటిఫికేషన్‌ను తొలిసారిగా వేసినప్పటికీ నియామకాలు లేకుండా కాలం గడిపేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా గత ఏడాది ఆగస్టు 7న నియామకాలకు చెందిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే నిబంధనల ప్రకారం అదే నెలాఖరు వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వగా.. సుమారు 83 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే గడువు ముగిసి కూడా 120 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు స్థానిక టీడీపీ పెద్దలు దీనిపై ఎలాంటి దృష్టి సారించలేదు. ఫలితంగా ఈ నెల 25న జరుగనున్న రథసప్తమి మహోత్సవాల్లో కొత్త ట్రస్ట్ బోర్డు కళ లేకుండా ఉండనుందని తెలుస్తోంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఈనెల 19 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించేలా మంత్రి అచ్చెన్నా యుడు ప్రకటించిన నేపథ్యంలో పాలకమండలి నోటిఫికేషన్ వేసినప్పటికీ నియమించని పరిస్థితి నెలకొంది.
తమ్ముళ్ల ఎదురుచూపులు
జిల్లాలో అతిపెద్ద ఆలయంగా శ్రీ సూర్యనారాయణ స్వామిఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉంది. అయితే జిల్లాలో శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కోటబొమ్మాళి, రావివలస తదితర ఆలయాలతో పాటు గ్రేడ్–1, 2 ఆలయాల్లో కూడా చాలావరకు ట్రస్ట్ బోర్డు నియామకాలను చేపట్టారు. కీలకమైన అరసవల్లి ట్రస్ట్ బోర్డు నియామకాలు మాత్రం జరగకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నగర పార్టీ, వివిధ విభాగాల్లో తెలుగు తమ్ముళ్ల నియామకాలను పూర్తిచేసిన ప్రభుత్వం, అఽధికార పార్టీ పెద్దలు, అరసవల్లిలో నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పండుగగా రథసప్తమిలోగానే ఈ నియామకాలు జరిగితే తమ గౌరవంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుందని పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్రస్ట్ ఉందా.. లేదా..?


