ఎస్‌బీఐ మరో బ్రాంచిలో | - | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ మరో బ్రాంచిలో

May 6 2025 1:10 AM | Updated on May 6 2025 1:10 AM

ఎస్‌బీఐ మరో బ్రాంచిలో

ఎస్‌బీఐ మరో బ్రాంచిలో

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచుల్లో వరుస పెట్టి అక్రమాలు బయటపడుతున్నాయి. గతంలో గార ఎస్‌బీఐలో తాకట్టు బంగారం బ్రాంచి నుంచి మాయమై, వేరే ఫైనాన్స్‌ సంస్థల్లో తాకట్టు పెట్టిన ఘటన వెలుగు చూడగా, ఆ మధ్య నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరుతో రుణాలను నొక్కేసిన బాగోతం బయటపడింది. తాజాగా కవిటి మండలం సిలగాం ఎస్‌బీఐ బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఇవన్నీ గతంలో జరిగినప్పటికీ కాలక్రమేణా బయటకు వస్తున్నాయి.

కవిటి మండలం సిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన తాజాగా వ్యవహారం వెలుగు చూసింది. శాఖా పరమైన విచారణలో అవినీతి బయటపడింది. దాంట్లో బాధ్యుడైన ఉద్యోగిని సస్పెండ్‌, డిస్మిస్‌ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఆడిట్‌లో అభ్యంతరం వస్తూ ఉండటంతో తాజాగా క్రిమినల్‌ చర్యల కోసం ఎస్‌బీఐ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు అధికారుల అంతర్గత పూర్తి విచారణ నివేదిక తీసుకొస్తే తప్ప ముందుకు వెళ్లలేమని పోలీసులు చెప్పడంతో ఇప్పుడా విచారణ నివేదికను, చర్యల ఫైల్‌ను పట్టుకుని వెళ్లే పనిలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నారు.

డ్వాక్రా సంఘాలకు బురిడీ..

కవిటి మండలం సిలగాం బ్రాంచి పరిధిలోని డ్వాక్రా సంఘాలను బురిడీ కొట్టించారు. సంఘాలకు ఇచ్చింది కొంతైతే... వాటి పేరున నొక్కేసింది మరికొంత. డ్వాక్రా సంఘాలకు అధికారికంగా ఉన్న ఖాతాలకు కొంతమేర రుణాలిచ్చినట్టు చూపించగా, ఆ సంఘాల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి, మరికొంత రుణాలు తీసుకున్నారు. దీంతో బ్యాంకు లెడ్జర్లలోనూ, డీఆర్‌డీఏ రికార్డుల్లోనూ రుణాల లెక్కల్లో తేడా వచ్చింది. దీనిపై శాఖా పరమైన విచారణ చేపట్టడంతో గతంలోనే అవినీతి బట్టబయలైంది. కాకపోతే, వ్యవహారాన్ని గట్టు చప్పుడు కాకుండా ఉంచారు. అంతర్గతంగానే సెటిల్‌ చేసేశారు. కాకపోతే, బ్యాంకు ఆడిట్‌లో ఆ అక్రమంపై అభ్యంతరం వ్యక్తం కావడంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి సదరు బ్యాంకు అధికారులకు ఎదురైంది. దానిలో భాగంగా ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు.

అవినీతి మాఫీ..

సిలగాం బ్రాంచిలో నాలుగేళ్ల క్రితం అవినీతి జరిగింది. ఆ అవినీతి కూడా మాఫీ అయిపోయింది. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తున్నందున ఈ సంఘాల పేరుతో రుణాలు నొక్కేసి, ఆ సొమ్మును బయట వడ్డీలకు తిప్పి మొత్తంలో సంపాదించుకున్నారు. అదేవిధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకు అధికారులు సొంతానికి వాడుకున్న రుణాలు కూడా మాఫీ అయిపోయాయి. ఈ విధంగా మాఫీలో ఎంత లబ్ధి పొందారు, నకిలీ ఖాతాల పేరుతో ఎంత మేర రుణాలను కొట్టేశారో అన్నది ఇంతవరకు బయటికి వెల్లడి కాలేదు. బ్యాంకు అధికారులు గుట్టుగానే ఉంచారు. మౌఖికంగా ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకొస్తే ఆ మొత్తం అవినీతి నివేదిక తీసుకురావాలని చెప్పడంతో వెనక్కి వచ్చేశారు. నాటి బాగోతంలో క్యాష్‌ ఇన్‌చార్జి సరోజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించారని, ఆ కేసులో సస్పెండ్‌తో పాటు డిస్మిస్‌ అయినట్టు కూడా తెలిసింది. ఇప్పటికే నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరు చెప్పి రుణాలు తీసుకుని, ఆ సొమ్ము దిగమింగేసిన ఘటనలో ఒకరు సస్పెండ్‌ అవ్వగా, గారలో తాకట్టు బంగారం మాయం చేసిన ఘటన అరెస్టులు, సస్పెన్ష్‌లు జరిగాయి. తాజాగా సిలగాం సరోజ్‌ కుమార్‌ ఒక్కరేనా? మిగతా వారి పాత్ర ఎంత? అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తేలే అవకాశం ఉంది.

కవిటి మండలం సిలగాం ఎస్‌బీఐ బ్రాంచి

వార్తల్లోకి ఎక్కిన సిలగాం బ్రాంచ్‌

డ్వాక్రా సంఘాల పేరుతో

రుణాల కాజేసిన వైనం

ఇప్పటికే బాధ్యుడిగా ఒకరిపై సస్పెన్షన్‌, డిస్మిస్‌

వరుస ఘటనలతో ఎస్‌బీఐకు అప్రతిష్ట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement