
ప్రశాంతంగా ఏయూఈఈటీ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏ యూఈఈటీ – 2025 (ఆంధ్రా యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ టెస్ట్) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఐదేళ్ల సమీకృత బీటెక్ కోర్సు కోసం ఏయూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. జిల్లాలో ఈ పరీక్ష కేంద్రానికి 433 మందిని కేటాయించగా, 391 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్‌గా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతాడ రాజశేఖర్‌రావు, జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్‌గా పొన్నాడ రామకృష్ణారావు వ్యవహరించారు.
ఉద్దానంలో
కార్గో ఎయిర్‌పోర్టు వద్దు
మందస: దశాబ్దాలుగా ఉద్దానంలో కొబ్బరి, జీడి, పనస, మామిడిపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారని, కార్గో ఎయిర్‌పోర్టు రాకతో వీరంతా ఉపాధి కోల్పోతారని భేతాళపురం, గంగువాడ, రాంపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్‌పోర్టు వద్దని చెబుతున్నా ప్రభుత్వం వినకపోవడం బాధాకరమన్నారు. ఎయిర్‌పోర్టును వ్యతిరేకిస్తూ వారంతా భేతాళపురంలో సోమ వారం ఆందోళన నిర్వహించారు. గత 180 రోజుల నుంచి నిరంతరం నిరసనలు చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఎయిర్‌పోర్టు పేరుతో 1394 ఎకరాల భూమితో పాటు మూలపేట పోర్టు నుంచి కార్గో ఎయిర్‌పోర్టు వరకు 55 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు కోసం కూడా రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.
యువకుడిపై పోక్సో కేసు నమోదు
మెళియాపుట్టి: ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను హైదరాబాద్ తీసుకుపోయిన యువకుడిపై టెక్కలి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. టెక్కలి ఎస్‌డీపీఓ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనబడటం లేదని 22 ఏప్రిల్ 2025న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. గంగరాజపురం గ్రామానికి చెందిన ఫ్రఫుల్లో ప్రధాన్ అనే 21 ఏళ్ల యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో ఈనెల 3వ తేదీన గంగరాజపురం గ్రామంలో యువకుడిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఎస్‌ఐ రమేష్ బాబు ఉన్నారు.

ప్రశాంతంగా ఏయూఈఈటీ పరీక్ష