కిడ్నీ సమస్యతో ఇంటర్ విద్యార్థి మృతి
పొందూరు: మండలంలోని కేసవదాసుపురం గ్రామానికి చెందిన లింగాల కిషోర్(16) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం ఎచ్చెర్లలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న కిషోర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు గుర్తించారు. పేద కుటుంబం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయింలేక కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిషోర్ పదో తరగతి లోలుగు హైస్కూల్లో చదివాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సుజాత, రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయాలి
శ్రీకాకుళం క్రైమ్ : నిందితులపై పెండింగ్ ఉన్న నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) త్వరితగతిన అమలు చేయాలనిఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ప్రాపర్టీ కేసుల్లో పెండింగ్ ఎన్‌బీడబ్ల్యూ అమలు, చైన్‌స్నాచింగ్, వాహనాల చోరీ, ఆలయాల్లో దొంగతనాలు తదితర నేరాలపై జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో వంటి కేసుల్లో ఎన్‌బీడబ్ల్యూ ఉంటే గుర్తించి వారి చిరునామా, ఇతర ఆధారాలను బట్టి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐలు కోటేశ్వరరావు, నేతాజీ పాల్గొన్నారు.
కిడ్నీ సమస్యతో ఇంటర్ విద్యార్థి మృతి


