
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్న కెప్టెన్(డ్రైవర్లు)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఎం.దశరథరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, తమ సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. పదేళ్లుగా అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. వీరికి సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.