
ఆస్తులు అప్పగింత..
శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పొట్టి శ్రీరాముల మార్కెట్, బాపూజీ కళా మందిర్, పెద్దపాడు చెరువు లోపల స్థలంతో పాటు మరో రెండు కీలక ప్రదేశాల్లోని స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూటమి సర్కార్ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఉన్న వాటిని కూల్చి పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ ప్రైవేటు వ్యక్తులే పొందేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్పారేషన్ అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా తీసుకుంది. దానిలో భాగంగానే పొట్టి శ్రీరాములు మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న వ్యాపారులు ఖాళీ చేయాలని తాఖీదులిచ్చారు. వాస్తవంగా పొట్టి శ్రీరాముల మార్కెట్‌ను గత వైఎస్ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది. మార్కెట్‌లో అడుగు పెట్టాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చింది. వరదనీరు, మురుగునీరు నిల్వలేకుండా, పక్కా సీసీ రోడ్లతో సుందరంగా తీర్చిదిద్దింది. కానీ, కూటమి ప్రభుత్వానికి అదేం కనిపించడం లేదు. తమ దారి తమదే అని ప్రైవేటు మోజులో పడింది.
● మున్సిపల్ కార్యాలయాన్ని కూలగొట్టి, ఆ స్థలంలో ప్రైవేటు వ్యక్తులతో నిర్మాణం చేపట్టి, అందులో కొన్ని ఫ్లోర్‌లను మున్సిపల్ కార్యాలయం కోసం, మిగతా ఫ్లోర్‌లను కమర్షియల్ కోసం వినియోగించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం నిర్మాణం చేపట్టే వ్యక్తులే పొందేలా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ కార్యాలయాన్ని కూలగొడితే...ఉన్న ఫలంగా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయానికి మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
● ఎంతో చరిత్ర గల బాపూజీ కళామందిర్‌తో పాటు మరికొన్ని మున్సిపల్ ఆస్తులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. చెప్పాలంటే ఆ ఆస్తులను వారికి ధారాదాత్తం చేసినట్టే. వాళ్లు చేసే నిర్మాణాలు చూసి మురిసిపోవడం తప్ప ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒరిగిందేమి ఉండదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ‘ప్రైవేటు’ యాక్షన్ మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందో నగర ప్రజలు వేచి చూడాల్సిందే.

ఆస్తులు అప్పగింత..