
ఎమ్మెల్యే తండ్రి, సోదరులు..రౌడీలతో బెదిరిస్తున్నారు!
ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు..
రౌడీలతో బెదిరిస్తున్నారు!
శ్రీకాకుళం క్రైమ్ : తాత వారసత్వంగా వచ్చిన తమ ఆస్తిని ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు ఆక్రమించుకోవడమే కాక కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని.. అడ్డుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు రాజకీయ పలుకుబడికి తలొగ్గుతున్నారని.. ఎమ్మెల్యేతో గొడవపడొద్దు.. ఆస్తి వదిలి వెళ్లిపోండని పోలీసులు కూడా అంటున్నారని ఓ మహిళ వాపోయింది. ఈ మేరకు కొత్తూరు మండల కేంద్రానికి చెందిన లోతుగెడ్డ కృష్ణవేణి తన భర్త శ్రీరామదూతం, కుటుంబీకులతో కలిసి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు హాజరై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గొండు గంగాధర్, వారి తండ్రి, ఎంపీపీ గొండు జగన్నాథంలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న బలగ వార్డులో ఉన్న తమ ఆస్తి ఉన్న ప్రాంతానికి వెళ్తే గంగాధర్, జగన్నాథంలు రౌడీలతో వచ్చి బెదిరించి తోసేయడమే కాక మారణాయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారని, తమ ప్రాణానికి హాని ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
అన్యాయం చేయడం తగదు..
అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడారు. బలగ వార్డులో డోల సూర్యానారాయణకు ఆస్తులండేవని.. అందులో 690/1లో 86 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల స్థలాన్ని తన తల్లి కాండవ జ్యోతికి రిజిస్ట్రేషన్ చేసి తాత ఇచ్చారన్నారు. తన తల్లి జ్యోతి తాత సూర్యనారాయణ ద్వారా దాఖలు పడిన స్థలాన్ని కుమార్తైనెన తనకు ఇచ్చారని కృష్ణవేణి చెప్పారు. ఈ మేరకు 1981 మార్చి 16న రిజిస్టర్ సెటిల్‌మెంట్ దస్తావేజు నెంబరు 837/1981 దఖలుపరిచారన్నారు. ఇదే స్థలంపై తమకి ఎటువంటి రక్తసంబంధీకురాలు కాని రౌతు జయలక్ష్మి అనే మహిళ గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యిందని తెరపైకి వచ్చిందన్నారు. వివాదాలు నడిచి కోర్టుకు వెళ్లగా జయలక్ష్మి పిటిషన్‌ను డిస్మిస్ చేశారన్నారు. ఇంతలో స్థలాన్ని జయలక్ష్మి తనకు విక్రయించిందని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గంగాధర్ తెరపైకి తీసుకురావడం అన్యాయమన్నారు.
ఇదే విషయమై ఎమ్మెల్యే గొండు శంకర్ వద్ద ‘సాక్షి’ ఫోన్లో ప్రస్తావించగా ల్యాండ్‌కు సంబంధించి డాక్యుమెంట్లు తమ సోదరుని వద్దనున్నాయని, అధికారులు నిర్మాణాలకు అనుమతులిచ్చారని, స్థలాన్ని తమ సోదరుడు గంగాధర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత రౌతు సీతారాంస్వామి కుమారుడు అమ్మారని.. వివాదంలో ఉన్నవి తామెందుకు కొంటామని అన్నారు. ఇవన్నీ ఓ వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నారని, గతంలో నిర్మాణం చేపట్టినప్పుడు మున్సిపాలిటీ వారు కూల్చేశారో.. కృష్ణవేణికి సంబంధించిన రౌడీమూకలు కూల్చేశారో తెలియదని స్పష్టం చేశారు.
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి..
ఎస్పీ గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్న మహిళ