
‘నా ప్రశ్నకు బదులేది’ పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం అర్బన్: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి పేడాడ కృష్ణారావు రచించిన నా ప్రశ్నకు బదులేది మినీ కవితా సంపుటిని ఆంధ్రప్రదేశ్ పెన్సనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. కవి, రచయత, జర్నలిస్ట్ అరసం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ కృష్ణారావు పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరామ్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్యతను ఈ కవితా సంపుటిలోని కవితలు ప్రతిబింబించేవిధంగా ఉన్నాయని కొనియాడారు. అరుణోదయ సాంస్కృతిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ వామపక్షాల ఐక్యత ప్రస్తుత భారతదేశంలోని సమస్యలను పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ, కార్మిక ప్రజా ఉద్యమాలను గుర్తుచేసే కవితలు పేడాడ కృష్ణారావు రాయడం అభినందనీయమని అన్నారు.
కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పప్పల రాజశేఖర్, బమ్మిడి శ్రీరామ్మూర్తి, వి.సత్యనారాయణ, కూన రంగనాయకులు, శీర రమేష్, బలివాడ ధనుంజయరావు, బోనెల రమేష్, కనిమెట్ట పద్మావతి, గురుగుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాంప్రసాద్, వల్లభ మల్లయ్య పాల్గొన్నారు.