
నీటికుండీలో పడి కార్మికుడు మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామ సమీపంలోని సాయిరాం గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రం బొంగైగో జిల్లా, గురునానక్ నగర్‌కు చెందిన కార్మికుడు కాళీరాయ్ (34) పరిశ్రమకు సంబంధించిన రీసైక్లింగ్ నీటి కుండిలో పడి మృతి చెందాడు. మృతుడు రాయ్ ఈ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో ఇదివరకు పనిచేశాడు. అయితే రాయ్ రెండు రోజులుగా పనికి రాకపోవడంతో తన స్వగ్రామానికి వెళ్లి ఉంటాడని భావించామని గ్రానైట్ యాజమాన్యం, తోటి కూలీలు చెబుతున్నారు. నిత్యం మద్యానికి అలవాటుపడిన రాయ్ ఆదివారం తెల్లవారేసరికి కంపెనీకి చెందిన 10 అడుగుల లోతు ఉన్నటువంటి రీసైక్లింగ్ నీటి కుండిలో శవమై తేలాడు. ఇది గమనించిన తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
రణస్థలం: ఈనెల 25వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఎన్‌హెచ్–16 రహదారిపై యూబీ పరిశ్రమ దగ్గర రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మరణించినట్లు జేఆర్‌పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవి ఆదివారం తెలిపారు. మృతుడికి 40–45 సంవత్సరాలు ఉంటాయని, తలకు బలమైన గాయమవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. గుండుతో ఉన్నాడని, కాఫీ కలర్ ప్యాంట్, ముదురు నీలిరంగు టీషర్టు ధరించినట్లు వెల్లడించారు. వ్యక్తి వివరాలు తెలిసినవారు 63099 90816, 63099 90850 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

నీటికుండీలో పడి కార్మికుడు మృతి