నీలమణి దుర్గ సన్నిధిలో వార్షిక నవరాత్రి
పాతపట్నం:
ఉత్కళాంధ్రుల కొంగుబంగారంలా విరాజిల్లుతున్న పాతపట్నం ఇలవేల్పు నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో 29వ తేదీ నుంచి అమ్మవారి వార్షిక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ఆంధ్ర, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అమ్మవారి మహోత్సవాలు భారీగా నిర్వహించేందుకు ఆలయ ఈఓ టి.వాసుదేవరావు చర్యలు తీసుకుంటున్నా రు. తొమ్మిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాలు ఇలా..
ఈ నెల 29న వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపస్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 30న కుంకుమార్చన, ఆవరణ దేవతా హోమాలు, మహారాజ భోగములు, మే 1న అష్టోత్తర శతనామార్చనలు, మూలమంత్ర, మంటపస్త దేవతా హోమాలు, 2న శ్రీలలిత త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, 3న శ్రీలక్ష్మీనారాయణ హోమాలు, 4న రుద్ర హోమాలు, 5న వర్ధనీ కలశోద్వాసనములు, అవభృద స్నానం, 6న వర్ధని ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. 7న బలిహరణలు, మహా పూర్ణాహుతితో పాటు ప్రతి రోజు రాత్రిళ్లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
29న సాయంత్రం తోట తులసి హరికథ, 30న సాయంత్రం ఉమామహేశ్వర భజన, మే 1 గురువారం సాయంత్రం రాగసుధ మ్యూజికల్ ఆర్కెస్ట్రా, 2న జైసంతోషిమాత కోలాటం, 3న హిమగిరి మాస్టారు ఆధ్వర్యంలో భరత నాట్యం, కూచిపూడి ప్రదర్శన, 4న ఆదివారం సాయంత్రం భజన, 5న బైరాగి నాయుడు సంగీత కచేరీ ఆ తర్వాతి రోజుల్లో పెద్దింటి మోహన్ దాస్ ఏకపాత్రాభినయం, సత్య హరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు.
నీలమణి దుర్గమ్మ
29 నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు
ఆంధ్రా, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు
ఏర్పాట్లు చేస్తున్నాం
అమ్మవారి మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయానికి రెండు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. – టి.వాసుదేవరావు, కార్యనిర్వహణాధికారి, నీలమణి దుర్గ ఆలయం
నీలమణి దుర్గ సన్నిధిలో వార్షిక నవరాత్రి


