
అలరించిన పౌరాణిక ప్రదర్శనలు
శ్రీకాకుళం కల్చరల్: పౌరాణిక కళాకారుడు మోహనరావు ప్రదర్శనలను 40 ఏళ్లుగా ఇప్పటికీ ఆదరిస్తుండటం గొప్ప విషయమని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో మహాలక్ష్మీ ఆధ్యాత్మిక సామాజిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో హార్మోనియం కళాకారుడు బి.ఎ.మోహనరావు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు పౌరాణిక ప్రదర్శనలు శనివారం ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన పౌరాణిక నటులు ధూపం రామకృష్ణ దంపతులను సత్కరిస్తూ ‘గాన కిరీటి’ బిరుదు ప్రదానం చేసి వెండి కిరీటం, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రదర్శించిన కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శనలు అలరించాయి. అర్ధరాత్రి వరకు ప్రదర్శనలు కొనసాగాయి. కార్యక్రమంలో పద్మశ్రీ యడ్ల గోపాలరావు, గండ్రెటి బలరాం, రిటైర్డ్ జడ్జి జి.వి.రమణ, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, నిక్కు అప్పన్న, సూర శ్రీనివాసరావు, గజల్ వాసుదేవాచారి, హైదరాబాద్‌కు చెందిన పౌరాణిక కళాకారులు కన్నేపల్లి సుబ్బారావు, ధర్మపురి గౌరీశంకర శాస్త్రి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ పల్లి నల్లనయ్య, పెదపెంకి శ్రీరామ్, సాయిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన పౌరాణిక ప్రదర్శనలు