రాగుల సేకరణకు సిద్ధం
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో రాగుల సేకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ద్వారా ఈ పంటకు సంబంధించిన కేవైసీ పూర్తిచేసిన రైతుల నుంచి రాగులను సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంతబొమ్మాళి మండలం రైతు సేవా కేంద్రం వద్ద రాగుల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాగులు పండించిన ఇతర మండలాల్లో క్లస్టర్ పద్ధతిలో రైతులకు మరింత చేరువలో రాగుల సేకరణ కేంద్రా లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,290గా ఉంటుందని తెలిపారు. గోనెసంచులు, కూలీ ఖర్చులను ప్రభుత్వం భరించనుందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ తరహాలోనే, రైతు సేవా కేంద్రాల ద్వారా రాగులను సేకరించి, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మద్దతు ధరకు తమ ఉత్పత్తిని ప్రభుత్వానికి అమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాల కోసం రైతులు 7732098637 లేదా 6281839352 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.


