ఎచ్చెర్ల క్యాంపస్: మాస్ కాపీయింగ్‌తో అందరి దృష్టిలో పడిన కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. టెన్త్ గణితం పరీక్ష సోమవారం జరగనుంది. తర్వాత సైన్స్, సోషల్ పరీక్షలు కూడా ఉన్నా యి. ఈ నేపథ్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పిలి మోడల్ స్కూల్‌లోని ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 425 మంది పరీక్ష రాస్తున్నా రు. 17 గదుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 21 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం పాత వారిని అందరినీ మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు ఇలా అందరినీ మార్పు చేస్తున్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
కొత్తూరులో చిరు జల్లులు
కొత్తూరు: కొత్తూరులో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. సుమారు నాలుగు నెలల నుంచి వర్షాలు లేవు. గత రెండు రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో మండలంలోని కర్లెమ్మ, పారాపురం, ఎన్‌ఎన్ కాలనీలతో పాటు పలు గ్రామాలలో వర్షం కురిసింది. వర్షం జీడి, మామిడి, నువ్వుతో పాటు కూరగాయ పంటలకు ఎంతో ఉపయోగపడింది.
భగత్‌సింగ్‌కు నివాళి
కవిటి: భారత స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని హెచ్‌ఎం బెజ్జిపల్లి దేవదాస్ అన్నారు. ఆదివారం భగత్‌సింగ్ 94వ జయంతి సందర్భంగా పెద్ద ఎర్రగోవిందపుట్టుగ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి భగత్‌సింగ్ వేషధారణతో అలరించాడు.
‘కుప్పిలి’పై ప్రత్యేక దృష్టి


