అరసవల్లి: విద్యార్ధి దశ నుంచే అడవులు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి శంబంగి వెంకటేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అరణ్య భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన కె.షర్మిళకు ప్రథమ బహుమతి, టీపీఎం పాఠశాలకు చెందిన నూకరాజుకు ద్వితీయ బహుమతి, ఏవీఎన్ పాఠశాలకు చెందిన శ్రీవల్లి, భరత్‌లకు తృతీయ బహుమతులు లభించాయి. వీరికి డీఎఫ్‌వో వెంకటేష్, ఏపీఎన్‌జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ పూజారి గోవిందరావులు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు.
ఉపఖజానా అధికారిగా పదోన్నతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జోన్–1 ఖజానా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సీనియర్ అకౌంటింగ్ అఽధికారులకు ఉప ఖజానా అధికారులుగా పదోన్నతి లభించింది. వీరిలో జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న జి.వి.ఎస్.ఎన్.మూర్తిని పార్వతీపురం మన్యం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప ఖజానా అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లూకలాపు ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డాక్టర్ ధర్మారావు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రసన్నకుమార్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించగా రెగ్యులర్ హెచ్‌ఓడీగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ పేడాడ రాము పిల్లల విభాగాధిపతిగా నియమితులయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం రెగ్యులర్ హెచ్‌ఓడీగా బాధ్యతలు స్వీకరిచారు.
విద్యుత్‌శాఖ ఏఈలకు పదోన్నతులు
అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలోని శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఏఈలుగా పనిచేస్తున్న పలువురు ఇంజినీర్లకు డిప్యూటి ఈఈ క్యాడర్‌లో పదోన్నతులు కల్పిస్తూ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఏఈగా పనిచేస్తున్న జి.వి.సురేష్‌కు నరసన్నపేట ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా, ఎంఆర్‌టీ ఏఈగా పనిచేస్తున్న టి.వి.శంకర్ శ్రీనివాస్‌కు సీటీఎం శ్రీకాకుళం డిప్యూటి ఈఈగా, విశాఖపట్నం మురళీనగర్‌లో ఏఈగా పనిచేస్తున్న ఎం.రాజేష్‌కు రణస్థలం ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా పదోన్నతులు కల్పించారు. ఇంతవరకు నరసన్నపేట డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న కె.ఇందిరకు టీఆర్‌ఈ శ్రీకాకుళం డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం


