
ఓపెన్ స్కూల్.. పరీక్షలకు సన్నద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 17 నుంచి నెలాఖరు వరకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 807 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా.. వీరంతా పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఎంపికచేశారు. శ్రీకాకుళం నగరంలో నాలుగు, టెక్కలిలో రెండు, పలాసలో రెండు చొప్పున కేంద్రాలను కేటాయించారు. ఈ కేంద్రాలకు సీఎస్‌లు, డీవోలతో పాటు 8 సిట్టింగ్ స్క్వాడ్‌లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. పరీక్ష నిర్వహణ మెటీరియల్స్‌ను సైతం చేరవేశారు. కాగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. మండుటెండల నేపథ్యంలోఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షా కేంద్రాలలో తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లతో పాటు మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లో 144 సెక్షన్‌తోపాటు ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధమని , పరీక్ష కేంద్రాల సీఎస్‌లు, డీవోలతో ఏర్పాట్లపై ఇప్పటికే పలుమార్లు సమీక్షించి సూచనలిచ్చామని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలకు 83282 69673, 95056 78655 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.
ఏర్పాట్లు పూర్తయ్యాయి
జిల్లాలో ఈ నెల 17 నుంచి ఎనిమిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు జరుగుతాయి. కలెక్టర్ ఆదేశాలు, డీఈఓ సూచనల మేరకు ఇప్పటికే అధికారులను నియమించాం. విద్యార్థులు హాల్‌టికెట్లను అధ్యయన కేంద్రాల నుంచి తీసుకోవాలి. ఏపీఓపెన్‌స్కూల్.ఓఆర్జీ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
– లియాకత్ ఆలీఖాన్, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్
జిల్లాలో రేపటి నుంచే సార్వత్రిక పదో తరగతి పరీక్షలు
8 కేంద్రాల్లో నిర్వహణ
హాజరుకానున్న 807 మంది విద్యార్థులు
ఎస్సైన్‌మెంట్ పరీక్షలను రాస్తున్న టెన్త్ విద్యార్థులు

ఓపెన్ స్కూల్.. పరీక్షలకు సన్నద్ధం