శ్రీకాకుళం పాతబస్టాండ్ : వెనుకబడిన తరగతుల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ యువత ఉపాధికి సబ్సిడీ రుణాలు, బి–ఫార్మా, డి–ఫార్మా చదివిని నిరుద్యోగులకు జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటుకు రాయితీ రుణాలు అందజేస్తామని పేర్కొన్నారు. రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రంతో ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్న తర్వాత ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించాలని ఆమె తెలిపారు.
● బీసీ కులాల యువ తకు సాధారణ అభివృద్ధి రుణాలు కింద 1935 యూనిట్లు మంజూరు చేస్తారు. స్లాబ్–1 రకం యూనిట్ విలువ రూ.2 లక్షలు లోపు ఉంటుంది. సబ్సిడీ రూ.75వేలు. స్లాబ్–2 రకం రూ.2లక్షలు నుంచి రూ.3 లక్షలు. సబ్సిడీ రూ.1.25 లక్షలు. స్లాబ్–3లో యూనిట్ విలువ రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షలు. సబ్సిడీ రూ.2 లక్షలు. మిగిలిన మొత్తం బ్యాంకు నుంచి పొందాల్సి ఉంటుంది.
● బీసీలకు జెనరీక్ మందుల షాపు ఏర్పాటుకు(బీ–ఫార్మా, డీ–ఫార్మా) 55 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూనిట్ విలువ రూ.8 లక్షలు. సబ్సిడీ రూ.4 లక్షలు.
● ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కులాలు(ఈబీసీ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య) స్వయం ఉపాధికి 41 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.వీటికి 50 శాతం సబ్సిడీ ఉంటుంది. వీరు జనరిక్ మెడికల్ షాపులు(8 యూనిట్లు) పెట్టుకుంటే 50 శాతం సబ్సిడీ ఉంటుంది.


