పరిగి: మండలంలోని ఊటుకూరు గ్రామంలో ఘోరం జరిగింది. గ్రామానికి చెందిన మంజుల అనే వృద్ధురాలు ఆరేళ్ల చిన్నారి అల్ఫియాపై రాయితో బాది తీవ్రంగా గాయపరిచింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు... మంజుల ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టులో కాయను పీక్కునేందుకు చిన్నారి అల్ఫియా వెళ్లింది. గమనించిన మంజుల రాయి తీసుకుని అల్ఫియా తలపై బాది తీవ్రంగా గాయపరిచింది. రక్తస్రావంతో ఉన్న చిన్నారిని అక్కడి నుంచి తన ఇంటి సమీపంలో మరో చోటుకు తీసుకెళ్లి పడేసి.. ఏమీ తెలియనట్లు ప్రవర్తించింది. చిన్నారిని వెతికేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమంగానే ఉందన్నారు.
బాధ్యురాలిని కఠినంగా శిక్షించాలి
బాధ్యురాలిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె చిన్నారి కుటుంబ సభ్యులతో కలిసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐ రవికుమార్‌తో చర్చించారు. నిందితురాలిపై ఇప్పటివరకూ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం తగదన్నారు. అలాగే పెనుకొండలో ఓ బాలికను గర్భవతిని చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అల్ఫియా తలకు తీవ్ర గాయాలైన దృశ్యం
ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారి అల్ఫియా
ఘోరానికి పాల్పడిన వృద్ధురాలు
మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి


