అనంతపురం:విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా కచ్చితమైన సమాచారాన్ని అఖిల భారత ఉన్నత విద్య సర్వే పోర్టల్‌లో సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్, అఖిల భారత ఉన్నత విద్య రాష్ట్ర నోడల్ అధికారి ప్రొఫెసర్ కె.రత్న షీలామణి సూచించారు. సోమవారం ఎస్కేయూ క్యాంపస్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంతీయస్థాయి అఖిల భారత ఉన్నత విద్య సర్వే వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రత్నషీలామణి మాట్లాడుతూ విద్యాసంస్థల్లో అఖిల భారత ఉన్నత విద్యా సర్వే సెల్స్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతీయ కార్యశాలలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విశ్వసనీయమైన సమాచారం వల్ల న్యాక్, ఎన్‌ఐఅర్‌ఎఫ్ వంటి గుర్తింపు, ర్యాంకింగ్ ప్రక్రియల్లో సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ వీసీ ఎన్‌వీఆర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ విద్యా ప్రణాళికలు, వనరుల కేటాయింపునకు వాస్తవ సమాచారమే పునాది అని అన్నారు. సంస్థాగత పనితీరు, అభివృద్ధి అంచనాకు ఈ సర్వే డేటా ఎంతో అవసరమని జేఎన్‌టీయూ(ఏ) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శన రావు తెలిపారు. యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ బి.రాజశేఖర్ పోర్టల్‌లో డేటా ఎంట్రీ విధానం, వెబ్ డీసీఎఫ్ మార్గదర్శకాలు, ఎన్‌ఐఆర్‌ఎఫ్, క్యూఎస్ ర్యాంకింగ్‌లతో అనుసంధానంపై అవగాహన కల్పించారు. ఎస్కేయూ నోడల్ అధికారి ప్రొఫెసర్ డి.ప్రభాకర్ స్వాగత ప్రసంగం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


