రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Nov 24 2026 1:06 AM | Updated on Nov 24 2026 1:06 AM

● భార్యాభర్తలతోపాటు మరొకరికి తీవ్ర గాయాలు

తాడిపత్రి రూరల్‌ : పట్టణ సమీపంలోని అనంతపురం– బుగ్గ బైపాస్‌లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాలగోపి (24) మృతి చెందాడు. ప్రమాదంలో అతని స్నేహితుడు కేవేంద్రతోపాటు భార్యాభర్తలు రాధిక, శివారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అప్‌గ్రేడ్‌ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాలజిల్లా గోర్విమానిపల్లికి చెందిన నంద్యాలగోపి తల్లిదండ్రులు ఉపాధి కోసం తాడిపత్రికి వలస వచ్చి గన్నెవారిపల్లికాలనీలో నివాసం ఉంటున్నారు. బీటెక్‌ చదివిన నంద్యాలగోపి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. అతని స్నేహితుడైన తమిళనాడుకు చెందిన కేవీంద్ర కుటుంబ సభ్యులు ఉపాధి కోసం తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డారు. వ్యక్తిగత పని నిమిత్తం నంద్యాలగోపి స్వగ్రామమైన గోర్విమానిపల్లికి స్నేహితుడు కేవీంద్రతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి ఆదివారం రాత్రి తాడిపత్రికి బయల్దేరారు. తాడిపత్రి మండలం వెలమకూరుకు చెందిన భార్యాభర్తలు రాధిక, శివారెడ్డి పని నిమిత్తం తాడిపత్రికి ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. నూతనంగా నిర్మించిన బైపాస్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నంద్యాలగోపీ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. గోపి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థి అదృశ్యం

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ కళ్యాణదుర్గం రోడ్డులోని శ్రీ గీతం కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థి గుండాల సాయి చరణ్‌ అదృశ్యమయ్యాడు. విద్యార్థి అదృశ్యంపై అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన గుండాల సాయిచరణ్‌ ఆరోగ్యం బాగోలేదని, సొంతూరుకు వెళ్తున్నానని చెప్పి ఈనెల 22న సాయంత్రం కాలేజీలో అనుమతి తీసుకొని బయటకెళ్లాడు. ఆటోలో బస్టాండ్‌కు చేరుకున్నా ఇంటికి మాత్రం చేరుకోలేదు. కుమారుడు కనిపించకపోవడంతో తండ్రి గుండాల సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాయి చరణ్‌ ఆచూకీ తెలిసిన వారు అనంతపురం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సెల్‌: 9440796811కు సమాచారం అందించాలని కోరారు.

కేకలు వేయొద్దన్నందుకు వ్యక్తిపై దాడి

గుత్తి రూరల్‌: మండలంలోని తొండపాడులో కేకలు వేయవద్దంటూ వారించిన వ్యక్తిపై కొందరు దాడి చేసి గాయపరిచారు. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన వెంకటేష్‌ ఆదివారం రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నాడు. పక్కింటిలో కొందరు యువకులు సెల్‌ ఫోన్‌లో గేమ్‌ ఆడుతూ పెద్దగా కేకలు వేస్తూ అల్లరి చేస్తున్నారు. తన నిద్రకు భంగం అవుతోందని వెంకటేష్‌ ఆ యువకుల వద్దకు వెళ్లి వారించాడు. యువకులు వాగ్వాదానికి దిగగా.. మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. దీంతో కర్రలు, ఇనుప రాడ్లతో వెంకటేష్‌పై యువకులు మూకుమ్మడిగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయమవడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తీవ్రంగా గాయపడిన కేవేంద్ర, శివారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement