కమల విలాపం | - | Sakshi
Sakshi News home page

కమల విలాపం

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

ఢిల్లీలో శాసిస్తున్న పార్టీ... గల్లీలో వెలవెలబోతోంది. పేరుకు జాతీయస్థాయి నేతలు, రాష్ట్ర మంత్రులున్నా... జిల్లాలో బీజేపీ ఉనికి కూడా కనిపించడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా... టీడీపీ నేతలు కమలనాథులను పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు. అధికార కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా పంపడం లేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీట్ల విషయంలోనూ టీడీపీ కనీసం జనసేనకు ఇచ్చిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కాషాయదళం రగిలిపోతోంది.

సాక్షి, పుట్టపర్తి

భారతీయ జనతా పార్టీ జిల్లాలో ఉనికి కోసం పాకులాడుతోంది. నియోజకవర్గానికి ఒకరిద్దరు నాయకులున్నా.. వారెక్కడా కనిపించరు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా...ఏ అధికారిక కార్యక్రమంలోనూ వారికి ప్రాధాన్యం ఉండదు. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్‌ బరిలో నిలిచి గెలిచి.. మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నా.. బీజేపీ జిల్లాలో పెద్దగా పుంజుకోలేదు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌ రేసులో ఎవరిని నిలబెట్టాలని టీడీపీ నాయకులు సర్వే ప్రారంభించారు. అయితే బీజేపీ నేతలను నామమాత్రంగా కూడా పరిగణనలోకి తీసుకోనట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనతో పోలిస్తే బీజేపీ వెనుకబడిపోయింది. జిల్లాలో జనసేనకు కనీస ప్రాతినిథ్యం లేదు..అయినా వాళ్లంతా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. కానీ బీజేపీ తరఫున జాతీయ స్థాయి నాయకుడు ఒకరు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మరొకరు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీలో గెలిచి.. ఆ తర్వాత ఓడిపోయి బీజేపీలో కొనసాగుతున్న నాయకులూ ఉన్నారు. అయితే ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా హడావుడి కనిపించలేదు. దీంతో కూటమి పార్టీల మధ్య ఏం జరుగుతోందనే దానిపై చర్చ మొదలైంది.

ధర్మవరం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ స్థానికంగా ఎలాంటి ప్రాధాన్యమూ లేదని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. అంతా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చేతుల్లో ఉందని, పేరుకు ఎమ్మెల్యే సత్యకుమార్‌ అయినా టీడీపీ నాయకులే హవా సాగిస్తున్నారని వాపోతున్నారు. కనీసం గ్రామస్థాయిలో కార్యకర్తలు లేని ఓ పార్టీ టీడీపీ నేతలతో జతకట్టి హడావుడి చేస్తుండగా..బీజేపీ నేతలు మాత్రం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ పెత్తనమే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున మాజీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ప్రత్యక్ష ఎన్నిక నేపథ్యంలో పోటీ చేస్తామని ప్రకటించకపోవడం గమనార్హం. మంత్రి సత్యకుమార్‌కు పార్టీలో ప్రాధాన్యం ఉందేమోగానీ, స్థానికంగా ఎలాంటి ప్రాధాన్యమూ ఇవ్వడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

‘పుడా’లోనే

కనిపించని

కమలం..

రెండు చోట్లా బరిలోకి టీడీపీనే?

రానున్న మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కదిరి, ధర్మవరం నుంచి టీడీపీ అభ్యర్థులే బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. ధర్మవరంలో బీజేపీ పోటీలో ఉంటే తనకు ప్రాధాన్యం ఉండదని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది. మరోవైపు కదిరిలో బీజేపీ జాతీయ నేత విష్ణువర్దన్‌రెడ్డికి.. టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కు గిట్టని సంగతి తెలిసిందే. ఒకరు సిఫారసు చేసిన జాబితాను మరొకరు తిరస్కరించడం ఖాయం.

మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను పక్కన బెడితే నామినేటెడ్‌ పోస్టు అయిన పుట్టపర్తి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పుడా) చైర్మన్‌ రేసులో కూడా టీడీపీ నాయకుల పేర్లే వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం బీజేపీ నాయకులను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోనట్లు తెలుస్తోంది. దీంతో పేరుకు కూటమిలో ఉన్నా...దేశాన్నే శాసించే స్థాయిలో ఉన్నా... బీజేపీ జిల్లాలో క్రమక్రమంగా కనుమరుగవుతోంది.

హడావుడిలో వెనుకంజే..

మంత్రి ఉన్నా.. ప్రాధాన్యం సున్నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement