గుడే.. బడి! | - | Sakshi
Sakshi News home page

గుడే.. బడి!

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

● శిథిలావస్థలో వైటీరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల భవనం

● పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

● ఆలయాన్ని పాఠశాల గా మార్చిన గ్రామస్తులు

● ఐదు తరగతులు..40 మంది విద్యార్థులు

● రెండేళ్లుగా ఒకే గదిలోనే అందరికీ చదువులు

బడిని గుడిగా భావిస్తాం. కానీ ఇక్కడ గుడినే బడిలా మార్చారు. వీరభద్రున్ని కీర్తిస్తూ అర్చకులు మంత్రోచ్ఛారణ పూర్తి కాగానే.. అదే గుడిలోనే ఐదు తరగతుల విద్యార్థులు అక్షరాలు దిద్దుతూ కనిపిస్తారు. ఇదేదో ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుక కాదు. రెండేళ్లుగా ఈ గ్రామంలో రోజూ కనిపించే దృశ్యమిది. ఇంతకీ గుడిలో బడి ఎందుకు నడిపిస్తున్నారో తెలుసుకోవాలంటే కథనం చదవాల్సిందే.

రొద్దం: వైటీరెడ్డిపల్లి గ్రామం..మండల కేంద్రం రొద్దానికి 20 కి.మీ దూరంలో ఉంటుంది. గ్రామంలో 2,000 మంది జనాభా ఉంది. గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉండగా..ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 40 మంది విద్యార్థులున్నారు. అయితే పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో చిన్నారులకు ఎప్పుడేం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనలు చెందారు. ఈ క్రమంలోనే గ్రామస్తులంతా సమావేశమై పాఠశాలకు నూతనం భవనం నిర్మించే వరకూ తరగతులను గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించేలా నిర్ణయించారు. అప్పటి నుంచి 40 మంది విద్యార్థులు ఆలయంలోనే పాఠాలు వల్లె వేస్తున్నారు.

ఉదయమే పూజలు.. ఆ తర్వాత పాఠాలు

ఆలయంలో తెల్లవారుజాము నుంచి 9 గంటల వరకూ పూజలు జరుగుతాయి. ఆ తర్వాత అర్చకుడు వెళ్లిపోగానే ఉపాధ్యాయులు వచ్చి ఐదు తరగతుల వారిని ఒకే చోట కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఒకవైపు ఒకటో తరగతి విద్యార్థులు అక్షరాలు దిద్దుతుంటే, కొద్ది దూరంలో ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు సాగుతున్నాయి. వైట్‌ బోర్డును గుడి గోడకు ఆనించి ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు.

సౌకర్యాలు కరువు..

గుడినే బడిగా చేయడంతో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కనీసం మరుగుదొడ్డి సౌకర్యం కూడా లేకపోవడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం కూడా గుడి బయట వండి గుడి ఆవరణలో వడ్డిస్తున్నారు. దీంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు చదువు చెప్పడానికి కాదనలేం గానీ దాన్ని గుడిలో నిర్వహించడం ఇబ్బందిగా ఉందని, పండుగలు, ఇతర కార్యక్రమాల వేళ పూజలు కూడా సరిగా చేసుకోలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు కొత్త భవనానికి నిధులు మంజూరు చేసి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.

విద్యామంత్రీ.. మీకు తెలుసా..?

డిజిటల్‌ తరగతులు, కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నే సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్నామంటూ ప్రచారం హోరెత్తిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు రొద్దం మండలంలోని వైటీరెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు భవనం లేక గుడిలో కొనసాగుతోందన్న విషయం తెలుసా...అన్న సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మార్చామంటున్న లోకేష్‌ ఈ పాఠశాల గురించి కూడా ఓసారి పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ పాఠశాల దుస్థితిని స్థానిక మంత్రి సవిత అయినా లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లాని కోరుతున్నారు.

నివేదిక పంపాం

వైటీ రెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండడంతో ఆలయంలో తరగతులు నిర్వహిస్తున్నాం. కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపాం. మండలంలో మరో ఏడు పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. అందులో పెద్దిపల్లి, కంచిసముద్రం, కోగిర, ఎల్‌జీబీ నగర్‌ ప్రాథమిక పాఠశాలల తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో ఈనెల 30వ తేదీలోపు ఆ గదులను తొలగిస్తున్నాం.

– జయభాస్కర్‌, ఎంఈఓ–2, రొద్దం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement