కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. 70 రోజులకుగాను రూ.1,30,72,622 నగదుతో పాటు 10 గ్రాముల బంగారు, 225 గ్రాముల వెండి హుండీల ద్వారా లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వెండిదండు శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాగే 48 అమెరికా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు , 200 అంగోళ క్వాన్జా, 5 నెపాలియన్ రూపీ నోట్లు వచ్చినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగినట్లు ఆలయ ఈఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవదాయ హుండీల పర్యవేక్షాణాధికారి ప్రసాద్, కెనరా బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
‘కేజీబీవీ’ తుది మెరిట్ జాబితా విడుదల
పుట్టపర్తి: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా తుది మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్, డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాలను గత నెలలో పరిశీలించామని, ఆ తర్వాత నిబంధనలు అనుసరించి తుది మెరిట్ జాబితాను రూపొందించి https// deosrisatyasai2025. blogspot. comలో అందుబాటులో ఉంచామన్నారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 26వ తేదీలోపు తగిన ఆధారాలతో బుక్కపట్నంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో నేరుగా సమర్పించాలన్నారు. గడువు అనంతరం వచ్చే వాటిని పరిగణనలోకి తీసుకోబోమన్నారు.
‘నీట్’ పీజీ ఫలితాల్లో
ఈశ్వర్‌రెడ్డి సత్తా
పుట్టపర్తి: నీట్ పీజీ ఫలితాల్లో ఓడీ చెరువు మండలం వేమారెడ్డిపల్లికి చెందిన డాక్టర్ మలక ఈశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. గురువారం విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 361వ ర్యాంక్ సాధించారు. గ్రామానికి చెందిన చితంబరరెడ్డి, సునందమ్మ దంపతుల కుమారుడైన ఈశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకొచ్చిన ర్యాంకుతో ప్రముఖ వైద్య కళాశాలలో పీజీ సీటు వస్తుందని, తద్వారా పేదలకు మెరుగైన వైద్యసేవలందించే అవకాశం దక్కుతుందన్నారు. తన విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకం, నిరంతర కృషి కారణమన్నారు.
17 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
పుట్టపర్తి టౌన్: జిల్లాలో రెన్యూవల్ కాకుండా మిగిలిపోయిన 17 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 1వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారి నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 6, హిందూపురం 3, పుట్టపర్తి 2, మడకశిర ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 6 చొప్పున మెత్తం 17 షాపులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 1 తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్నవారు నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు డీడీ తీసి పూర్తి చేసిన దరఖాస్తుకు జతపరచాలన్నారు. దరఖాస్తులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హైబ్రీడ్ విధానంలో చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 3వ తేదీన దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. అక్టోబర్ 5వ తేదీన కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయిస్తామన్నారు. పూర్తి వివరాలకు పుట్టపర్తిలోని ఎకై ్సజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


