12 మెడికల్‌ పీజీ సీట్ల మంజూరు | - | Sakshi
Sakshi News home page

12 మెడికల్‌ పీజీ సీట్ల మంజూరు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

అనంతపురం సిటీ: అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు నూతనంగా 12 వైద్య పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎంఎస్‌ ఆర్థోకు నాలుగు, ఎండీ పెథాలజీకి నాలుగు, ఎండీ ఎమర్జెన్సీ మెడిసిన్‌కు నాలుగు సీట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం సుశ్రుత హాలులో అభినందన సభ ఏర్పాటు చేసి, కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమానికి అడిషనల్‌ డీఎంఈ, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయశ్రీ ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి అధ్యక్షత వహించారు. అనంతరం డాక్టర్‌ మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌గా విజయశ్రీ బాధ్యతలు తీసుకున్న ఏడాదిలోపు ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం అనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు.

నెల రోజులుగా బిందెమోత

● కాచికుంట ఆర్డీటీ కాలనీలో

తాగునీటికి కటకట

అమరాపురం: తాగేందుకే కాదు.. రోజువారీ అవసరాలకూ కాలనీలో నీళ్లులేవు. అందుకే ఆ కాలనీ వాసులు పనులు మానుకుని కిలోమీటర్‌ దూరంలోని గ్రామంలోకి వెళ్లి బిందెలతో నీరు తెచ్చుకుంటున్నారు. మండల పరిధిలోని కాచికుంట ఆర్డీటీ కాలనీలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికోసం గతంలో ఆర్డీటీ సంస్థనే బోరు వేయించి నీటి సౌకర్యం కల్పించింది. ప్రస్తుతం తీవ్ర వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటగా...బోరు ఎండిపోయింది. దీంతో నీటికోసం కాలనీలో మహిళలు, చిన్నారులు పడరానిపాట్లు పడుతున్నారు. పురుషులంతా అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా ఏ నాయకుడికీ వీరి కష్టం పట్టడం లేదు. ఏ అధికారీ మనసూ కరగడం లేదు. ఫలితంగా కాచికుంట ఆర్డీటీ కాలనీవాసులకు బిందెమోత తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

రీపోలింగ్‌ ప్రశాంతం

పెద్దవడుగూరు/ కూడేరు : జిల్లాలో శుక్రవారం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పెద్దవడుగూరు మండలం చిత్రచేడులోని 46వ పోలింగ్‌ బూత్‌లో 905 ఓట్లకు గాను 535 ఓట్లతో 58.34 శాతం పోలింగ్‌ నమోదైంది. 47వ పోలింగ్‌ బూత్‌లో 907 ఓట్లకు గాను 522 ఓట్లతో 57.55 పోలింగ్‌ జరిగినట్లు ఆర్‌ఓ వెంకటరమణనాయక్‌, తహసీల్దార్‌ ఉషారాణి తెలిపారు.

మరుట్ల–2లో 74 శాతం పోలింగ్‌

కూడేరు మండలం మరుట్ల–2వ కాలనీ 8వ బూత్‌లో శుక్రవారం రీ పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది. వివాదాలకు కేంద్రంగా మారిన సీఐ రాజును పోలింగ్‌కు దూరం పెట్టారు. 820 మందిలో 610 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ 74 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement