పుట్టపర్తి అర్బన్: పరిషత్ ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటల సమయమే ఉంది. అధికార పార్టీ దౌర్జన్యాలు, దొంగ ఓట్ల నడుమ సాగిన పోలింగ్‌లో ఫలితాలు ఎలా ఉంటాయోనని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 32 జెడ్పీటీసీ స్థానాలు, 377 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగ్గా...శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 1,131 మంది అభ్యర్థుల భవితవ్యం శనివారం సాయంత్రానికి తేలనుంది. ఇందులో 32 జెడ్పీటీసీ స్థానాలకు 141 మంది, 377 ఎంపీటీసీ స్థానాలకు 990 మంది పోటీ పడ్డారు. వీరి భవిష్యత్తు బ్యాలెట్ పెట్టెల్లో దాగి ఉంది. శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనా, తొలిరౌండ్ ఫలితం మధ్యాహ్నం తర్వాతే వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పోలైన ఓట్లను వేరు చేస్తారు. ఆ తర్వాత 25 ఓట్లను ఒక కట్టగా కట్టి లెక్కింపు ప్రారంభించనున్నారు. దీంతో ఫలితాల వెల్లడి ఆలస్యం కానుంది.
జిల్లాలో కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లోని వివిధ మండలాలతో పాటు రాప్తాడు నియోజకవర్గంలో సీకేపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల పరిధిలో గురువారం పోలింగ్ జరగ్గా...బ్యాలెట్లను ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. శనివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు.
● ధర్మవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల పరిధిలోని 46 ఎంపీటీసీ, నాలుగు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం మండలానికి 8 టేబుళ్ల చొప్పున మొత్తం 32 టేబుళ్లు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపునకు 96 మందిని నియమించారు. మరో 24 మందిని రిజర్వ్‌లో ఉంచారు.
● ధర్మవరం బాలుర ఉన్నత పాఠశాలలో కనగానపల్లి, రామగిరి, సీకేపల్లి మండలాల పరిధిలోని 19 ఎంపీటీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాలకు పోలైన ఓట్లు లెక్కించనున్నారు. ఒక్కో మండలానికి 8 టేబుళ్ల చొప్పున మొత్తం 24 టేబుళ్లు సిద్ధం చేశారు. అలాగే 72 మందిని కౌంటింగ్ కోసం నియమించారు. మరో 18 మందిని రిజర్వ్‌గా ఉంచారు.
● కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో కదిరి, తలుపుల, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఎన్పీకుంట మండలాల పరిధిలో 61 ఎంపీటీసీ, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. మండలానికి 8 చొప్పున 48 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కో టేబుల్‌కు 24 మంది చొప్పున 192 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. మరో 36 మందిని రిజర్వ్‌గా ఉంచారు.
● కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రంలో పుట్టపర్తి నియోజకవర్గంలోని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం, నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలు, ఆరు జెడ్పీటీసీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 48 టేబుళ్లు సిద్ధం చేశారు. 177 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. మరో 36 మందిని రిజర్వ్‌గా ఉంచారు.
● మడకశిరలోని ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో మడకశిర నియోజకవర్గంలోని మడకశిర, రొళ్ల, గుడిబండ, అమరాపురం, అగళి మండలాలకు సంబంధించిన 69 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో పోలైన బ్యాలెట్లను లెక్కించనున్నారు. మొత్తం 40 టేబుళ్లు సిద్ధం చేశారు. 120 మంది కౌంటింగ్ స్టాఫ్‌ను నియమించారు. మరో 30 మంది రిజర్వ్‌గా ఉంచారు.
● హిందూపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ( కొత్త భవనం, గూడెం ఏరియా)లో హిందూపురం నియోజకవర్గంలోని హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలకు సంబంధించిన 42 ఎంపీటీసీ స్థానాలు, మూడు జెడ్పీటీసీ స్థానాల పరిధిలో పోలైన బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 8 టేబుళ్ల చొప్పున మొత్తం 24 టేబుళ్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ కోసం 72 మందిని నియమించారు. మరో 18 మందిని రిజర్వ్‌గా ఉంచారు.
● పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెనుకొండ నియోజకవర్గంలోని పెనుకొండ, రొద్దం, పరిగి, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లోని 76 ఎంపీటీసీ స్థానాలు, ఐదు జెడ్పీటీసీ స్థానాల ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 40 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 120 మంది కౌంటింగ్ సిబ్బంది నియమించడంతో పాటు 30 మందిని రిజర్వ్‌గా ఉంచారు.
తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ఉదయం 8 గంటల నుంచే
లెక్కింపు ప్రారంభం
తొలుత ఎంపీటీసీ, తర్వాత
జెడ్పీటీసీల ఫలితాలు వెల్లడి
మధ్యాహ్నం తొలి రౌండ్ ఫలితం
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన
జిల్లా యంత్రాంగం
పెనుకొండ టాప్...ముదిగుబ్బ లాస్ట్
జిల్లాలో అత్యధికంగా గోరంట్ల మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలుండగా, ఆ తర్వాత పరిగి, మడకశిర, ముదిగుబ్బ మండలాల్లో 17 చొప్పున స్థానాలున్నాయి. జిల్లాలోని కొన్ని ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, రామగిరిలో మూడు స్థానాలకు, బత్తలపల్లిలో 7 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇక జిల్లాలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల పరిధిలో 11,35,917 మంది ఓటర్లు ఉండగా గురువారం జరిగిన పోలింగ్‌లో 73.72 శాతం మంది అంటే 8,37,406 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అత్యధికంగా పెనుకొండలో 80.87 శాతం మంది ఓటు వేయగా, తర్వాతి స్థానాల్లో పుట్టపర్తి (79.81 శాతం), రొళ్ల (79.21 శాతం), నల్లచెరువు (79.09 శాతం) మండలాలు ఉన్నాయి. అతి తక్కువ శాతం పోలింగ్ నమోదైన మండలాల్లో ముదిగుబ్బ (66.61 శాతం), తనకల్లు (67.81 శాతం), రామగిరి (68.35 శాతం), ఎన్పీకుంట (69.43 శాతం), గోరంట్ల (69.53 శాతం) మండలాలు ఉన్నాయి.
తేలనున్న 1,131 మంది భవితవ్యం
కౌంటింగ్ కేంద్రాలు ఇలా..


