పింఛన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా? | - | Sakshi
Sakshi News home page

పింఛన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా?

Sep 25 2026 2:29 AM | Updated on Sep 25 2026 2:29 AM

పరిగి: ‘‘రెండేళ్లు ఎంతమంది వేడుకున్నా...పేదలు అరచిగగ్గోలు పెట్టినా పింఛన్ల గురించి ఆలోచించని చంద్రబాబు ప్రభుత్వం...ఇప్పుడు పింఛన్లకు దరఖాస్తులు తీసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నందున పేదలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టేందుకు పింఛన్లు అంటూ కొత్త నాటకానికి తెరతీసింది’’ అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌ అన్నారు. గురువారం ఆమె మండలంలోని ఊటుకూరు, విట్టాపల్లి గ్రామాల్లో పర్యటించారు. విట్టాపల్లిలో జరిగిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్లే అర్హులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి దరఖాస్తు చేయించేవారని, కొత్త పింఛన్ల మంజూరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగేదని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో పింఛన్‌ల పేరుతో నాటకం ఆడుతున్నారని, టీడీపీ నాయకులు ఇంటింటికీ తిరిగి తమ అనుయాయులకు మాత్రమే పింఛన్‌ మంజూరు చేసేందుకు ప్లాన్‌ చేశారన్నారు. పింఛన్ల వెనుక భారీ మోసం ఉందన్నారు. అర్హులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం... నేడు ఆగమేఘాలతో కనీస గడువు ఇవ్వకుండా కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలతో పింఛన్ల దరఖాస్తులు తీసుకుంటూ అర్హులైన వారిని పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సూపర్‌ సిక్స్‌ హామీలెక్కడా?

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత నూతన పింఛన్ల కోసం తీసుకుంటున్న దరఖాస్తుల్లో వృద్ధాప్య పింఛన్‌కు 60 ఏళ్ల వయస్సు ఉండాలనే నిబంధన పెట్టి మాట తప్పారన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సవిత ఎన్నికల సమయంలో కురుబ గుడికట్టు కులస్తులకు న్యాయం చేసి అందరికీ పింఛన్లు అందిస్తామని ప్రగల్భాలు పలికారని, కానీ నేటికీ వారికి న్యాయం చేయలేదన్నారు. చివరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో ఓ బీసీ వసతి గృహంలో నిరుపేద బీసీ పిల్లలకు అడ్మిషన్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన అరకొర సంక్షేమ పథకాలు కూడా అన్ని తెలుగుతమ్ముళ్లకే కట్టబెట్టారన్నారు. ప్రస్తుతం చేస్తున్న పింఛన్ల డ్రామా అంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మోసగించడానికేనన్నారు. కూటమి నాయకులు ఇప్పటికైనా స్వార్థపూరిత రాజకీయాలు మాని, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని హితవు పలికారు. ఉషశ్రీచరణ్‌ వెంట పార్టీ మండల కన్వీనర్‌ నరసింహమూర్తి, పార్టీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలోనే

ప్రజలు గుర్తొస్తారా?

ప్రభుత్వాన్ని నిలదీసిన ఉషశ్రీచరణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement