తమ్ముళ్ల మధ్య ‘ప్రోటోకాల్‌’ వార్‌ | - | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల మధ్య ‘ప్రోటోకాల్‌’ వార్‌

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

సాక్షి, పుట్టపర్తి: పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేశ్‌ పర్యటన సందర్భంగా స్వాగతం పలికేందుకు వచ్చిన టీడీపీ నేతలు ప్రొటోకాల్‌ విషయమై తగవు పడ్డారు. ఏకంగా అధికార పార్టీ నేతల తిట్ల దండకం విసుగు తెప్పించింది. మా జిల్లాలో మీ పంచాయితీ ఏందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అసహనం వ్యక్తం చేయగా.. పుట్టపర్తిలో మమ్మల్ని చూసి అయినా గౌరవం ఇవ్వాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సర్దిచెప్పారు. అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు కలగజేసుకొని వారిని వారించారు. నేతల మధ్య ప్రొటోకాల్‌ రాద్దాంతం ఆలస్యంగా వెలుగుచూసింది.

రగడ రాజుకుందిలా..

పుట్టపర్తి విమానాశ్రయంలో మంత్రి నారా లోకేశ్‌ రాకకు అరగంట ముందు మంగళవారం అధికార పార్టీ నేతల మధ్య రభస జరిగింది. లోకేష్‌ జిల్లా పర్యటనను పురస్కరించుకొని నేతల మధ్య ప్రొటోకాల్‌ వివాదం కాస్త.. మాటల యుద్ధానికి దారి తీసినట్లు తెలుస్తోంది. అనంతపురం జిల్లా విభేదాలను పుట్టపర్తిలో ఎందుకు వెలుగులోకి తెస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడి హోదాలో ఒకాయన మండిపడినట్లు తెలిసింది.

ఎల్‌1.. ఎల్‌2 గొడవ

పుట్టపర్తి విమానాశ్రయంలో నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ వచ్చారు. అయితే ప్రభాకర్‌ చౌదరిని ఎల్‌2లో ఉంచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే దగ్గుపాటి రాగానే.. ఎల్‌1లోకి రావాలని అధ్యక్షుడు ఆహ్వానించారు. అయితే ఆయన తాను ఎల్‌2లోనే ఉంటానని వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఉన్నఫలంగా వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి జోక్యం చేసుకొని వెనుదిరిగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కల్పించుకొని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ గొడవ పడేందుకు పుట్టపర్తికి వచ్చినట్లు ఉందని ఘాటుగా మాట్లాడటంతో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత అదే పార్టీకి చెందిన మరో అధ్యక్షుడు జోక్యం చేసుకొని లోకేశ్‌ అన్న వస్తున్నారని చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లు సమాచారం.

మంత్రి లోకేష్‌ సాక్షిగా తగవు

రాప్తాడులో విగ్రహావిష్కరణను పురస్కరించుకొని జిల్లా పర్యటనకు వచ్చిన నారా లోకేశ్‌ సాక్షిగా తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్‌ వివాదం రచ్చకెక్కింది. ముందు వరుస.. వెనుక వరుస అంటూ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. రాప్తాడులో మంత్రి లోకేష్‌ను కలవడం కష్టమని భావించిన కొందరు నేతలు ముందు జాగ్రత్తగా పుట్టపర్తికి చేరుకున్నట్లు సమాచారం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరికి మధ్య విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుట్టపర్తికి వచ్చి స్వాగతం పలికినట్లు తెలిసింది.

నారా లోకేష్‌ పర్యటనలో

బయటపడ్డ విభేదాలు

మాజీ ఎమ్మెల్యే వైకుంఠంపై

ఎమ్మెల్యే దగ్గుపాటి సైటెర్లు

సర్దిచెప్పిన టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు

మా జిల్లాలో మీ పంచాయితీ ఏందన్న ఎంఎస్‌ రాజు

ఆలస్యంగా వెలుగు చూసిన

‘తమ్ముళ్ల’ ప్రొటోకాల్‌ గొడవ

ఆది నుంచి ఆధిపత్య విబేధాలే..

అనంతపురం జిల్లా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్‌ చౌదరి మధ్య ఆరంభం నుంచి విభేదాలు కొనసాగుతోంది. అంతకుముందు ఎమ్మెల్యేగా పని చేసి.. ఆ తర్వాత ఐదేళ్లు అనంతపురం టీడీపీ బాధ్యుడిగా పని చేసిన వైకుంఠం ప్రభాకర్‌చౌదరిని పక్కనబెట్టి.. రాత్రికి రాత్రే దగ్గుబాటి ప్రసాద్‌ బీ–ఫారం తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికారంలోకొచ్చిన నాటి నుంచి దగ్గుబాటితో పాటు ఆయన అనుచరుల దందాలు, వసూళ్లు, ఫోన్‌ కాల్‌ రికార్డింగ్‌లు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఓ సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి మీడియా సమావేశంలో గత రెండేళ్లలో అనంతపురం ఎమ్మెల్యే అక్రమ ఆదాయం రూ.200 కోట్ల పైనే ఉంటుందని విమర్శలు చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement