రొళ్ల: తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పుట్టపర్తి కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు రొళ్ల ఎంపీపీ ఎస్‌ఆర్ సుమ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ తన అనుమతి లేకుండా ఈ ఏడాది మే 5న ఎంపీడీఓ శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ తీర్మానం చేశారన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికిగాను 16వ ఆర్థిక సంఘం ద్వారా రూ.97,78,080 నిధులు మంజూరు చేయించుకోవడం కోసం ఎంపీడీఓ ఏకంగా తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 21న గుర్తించి ఎంపీడీఓ చాంబర్ చేరుకుని ఎంపీడీఓ శ్రీనివాసరావును ప్రశ్నించామన్నారు. ఈ నెల 23న ఎంపీపీ పదవి కాలం ముగియనున్న నేపథ్యంలో ముందుగానే ప్లాన్ ప్రకారం ఎంపీడీఓ నిధులను పక్కదారి పట్టించే ఉద్దేశంతోనే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తన సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. పొరబాటున తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఎంపీడీఓ ఒప్పకుని, క్షమించాలని వేడుకున్నారన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని బాధ్యుల పై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నివేదికలు ఇవ్వాలని ఉమ్మడి అనంతపురం జెడ్పీ సీఈఓకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బి.అనంతరాజు, న్యాయవాది రంగనాథ్, నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫోర్జరీ అవాస్తవం
రొళ్ల ఎంపీపీ సంతకం ఫోర్జరీ చేసినట్లు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఎంపీడీఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు కోసం పంపిన ప్రతిపాదనలో ఎంపీపీ సంతకాన్ని ఫోర్జరీ చేయలేదన్నారు. తాను ఎంపీపీ సంతకం ఫోర్జరీ చేసినట్లు ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు ఎంపీపీ ఫిర్యాదు


