ఉత్కంఠ పోరులో వెస్ట్‌ బెంగాల్‌ గెలుపు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో వెస్ట్‌ బెంగాల్‌ గెలుపు

Sep 24 2026 2:36 AM | Updated on Sep 24 2026 2:36 AM

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా గ్రామం వేదికగా సాగుతున్న డాక్లర్‌ తాలిమెరెన్‌ ఆవో బాలికల అండర్‌–19 జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ప్రత్యర్థి జట్టుపై సాగిన ఉత్కంఠ పోరులో వెస్ట్‌ బెంగాల్‌ జట్టు విజయం సాధించింది. జాతీయ టైటిల్‌ సాధనకు 15 రాష్ట్రాల జట్లు తలపడగా ఇప్పటికే మణిపూర్‌ జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం జరిగిన రెండో సెమీఫైనల్‌లో తమిళనాడు, వెస్ట్‌ బెంగాల్‌ జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయమే తుది లక్ష్యంగా ఇరు జట్ల క్రీడాకారులు తమ సర్వశక్తులూ ధారపోశారు. ఆట 22వ నిమిషంలో కొనసాగుతుండగా తమిళనాడు క్రీడాకారిణి దర్శిని తనదైన దూకుడు ప్రదర్శిస్తూ తొలి గోల్‌ సాధించి జట్టుకు ఆధిక్యం చేకూర్చింది. ఈ దశలో వెస్ట్‌ బెంగాల్‌ క్రీడాకారులూ వ్యూహాత్మకంగా ఆడుతూ ప్రత్యర్థి జట్టు అంచనాలను తారుమారు చేస్తూ వచ్చారు. ఆట 49వ నిమిషంలో ఉండగా వెస్ట్‌బెంగాల్‌కు చెందిన స్వర్ణఛైత్రి గోల్‌ సాధించి స్కోర్‌ను సమం చేసింది. అనంతరం అదే దూకుడును వెస్ట్‌బెంగాల్‌ క్రీడాకారులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ దశలో విజయమే లక్ష్యంగా ఇరు జట్ల క్రీడాకారులు హోరాహోరీగా తలపడడంతో ఉత్కంఠ నెలకొంది. ఆట 58 నిమిషంలో కొనసాగుతుండగా వెస్ట్‌బెంగాల్‌ క్రీడాకారిణి మలిత ముండా ఓ గోల్‌ సాధించింది. అనంతరం 68వ నిమిషంలో ఆట కొనసాగుతుండగా మరోగోల్‌ సాధించి జట్టు విజయంలో కీలకంగా మారింది. దీంతో వెస్ట్‌ బెంగాల్‌ జట్టు తమిళనాడుపై 3–1 గోల్స్‌ తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. శుక్రవారం మణిపూర్‌, వెస్ట్‌ బెంగాల్‌ జట్ల మధ్య తుదిపోరు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement