● బాల్య వివాహం చేసుకోబోయిన యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
పుట్టపర్తి అర్బన్: తెల్లారితే బాల్య వివాహం జరుగుతుందని తెలుసుకున్న అధికారులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో రంగంలోకి దిగి పెళ్లిని అడ్డుకున్న ఘటన పుట్టపర్తి మండలం పెడపల్లి పంచాయతీలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. పెడపల్లి పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ఇంటర్ చదువుతోంది. ఓ యువకుడితో గుట్టుచప్పుడు కాకుండా ఓ దేవాలయంలో వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయమే పెళ్లి జరగాల్సి ఉంది. అయితే మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి చైల్డ్‌లైన్ 1098, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రజితకు బాల్య వివాహంపై సమాచారం అందించారు. రజిత వెంటనే గ్రామానికి చేరుకున్నారు. అలాగే సంబంధిత చైల్డ్‌లైన్ సిబ్బంది, వీఆర్‌ఓ, కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలను పిలిపించి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ముందుగా వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించగా బాలిక తల్లిదండ్రులతో పాటు అదే గ్రామానికి చెందిన వరుడి తల్లిదండ్రులు కూడా ససేమిరా అన్నారు. చివరకు జిల్లా అధికారులతో మాట్లాడించి పెళ్లిని నిలిపి వేశారు. ఇరు వర్గాల వారితో వినతిపత్రాలను రాయించుకొని పెళ్లి జరగకుండా బాలికను తమ వద్దే ఉంచుకున్నారు. పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం చుట్టు పక్కల గ్రామాల్లో చర్చనీయంశమైంది.
ఉపాధి కల్పనకు ప్రణాళికలు రూపొందించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రణాళికలను రూపొందించాలని పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సర్వేలు పూర్తి చేసుకున్న పరిశ్రమలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా జరిగిన ఒప్పందాల పురోగతిని శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ధరఖాస్తు చేసుకునే వారికి వెంటనే అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను తయారు చేసే దిశగా ‘‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’’అనే నినాదంతో రూపొందించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ వర్క్‌షాప్ కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 30న పుట్టపర్తి సాయి తేజ కన్వెన్షన్ హాలులో నిర్వహించబోయే వర్క్‌షాప్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ జె.నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.


