సర్కారు కు.ని.కి పాట్లు | - | Sakshi
Sakshi News home page

సర్కారు కు.ని.కి పాట్లు

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

సాక్షి, పుట్టపర్తి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భూమి పెరగడం లేదు. పెరుగుతున్న జనాభాకు ఆహారం, చదువు, ఉద్యోగం, ఆర్థిక అవసరాలు తీర్చడం కష్టంగా మారుతోంది. ఫలితంగా జనాభా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లను ప్రోత్సహించాయి. ఆపరేషన్‌ చేయించుకున్న వారికి నగదు ప్రోత్సాహంతో పాటు స్వచ్ఛంద సంస్థల నుంచి బహుమానాలు ప్రదానం చేసిన కాలాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం జనాభా పెంచాలని ప్రచారం చేస్తుండటంతో కు.ని ఆపరేషన్లు కూడా తగ్గుముఖం పట్టాయి.

ముగ్గురిని కనాలంటూ...

రాష్ట్రంలో జననాల రేటు రెండు కంటే తక్కువగా ఉందని.. ఇకపై ప్రతి జంటా ముగ్గురిని కనాలని.. వారిని పోషించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. ఇందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇస్తామని చంద్రబాబు సర్కార్‌ ప్రచారం చేస్తోంది. అయినా కు.ని ఆపరేషన్లు చేయించుకుంటున్న వారు ఉన్నారు. కానీ గతంతో పోలిస్తే ఏడాదిన్నర కాలంగా కు.ని. ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా జనాభా విపరీతంగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. గతంలో కు.ని. ఆపరేషన్లు టార్గెట్‌ చేసుకుని సంఖ్య పెరిగేలా అధికారులు ప్రయత్నించేవారు. అయితే ప్రస్తుతం ఆపరేషన్‌ కోసం వచ్చిన వారికి మాత్రమే చేస్తున్నారు. ప్రత్యేకంగా అవగాహన కల్పించడం కూడా మానేశారు.

తూతూ మంత్రంగా అవగాహన

కుటుంబ నియంత్రణ గురించి అధికారులు ఎక్కడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం లేదు. కేవలం గర్భ నిరోధం, లింగ నిర్ధారణ, బాల్య వివాహాల గురించి మాత్రమే చైతన్య పరుస్తున్నారు. రోజురోజుకీ జనాభా పెరిగిపోతున్నా.. కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. పైగా ఎక్కువ మంది ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం మరింత అవరోధానికి దారి తీస్తోంది. దీంతో కు.ని. ఆపరేషన్లను అధికారులు పట్టించుకోవడం లేదు. అవసరం ఉన్నోళ్లు వస్తే.. చేసి పంపిస్తున్నారు. అంతేకానీ జనాభా నియంత్రణపై ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.

ఏడాదిన్నరలో మరీ తక్కువగా..

గత రెండేళ్ల వ్యవధిలో కు.ని. ఆపరేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. జనాభా పెరగాలంటూ.. తాను పెద్ద దిక్కులా ఉంటానంటూ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలతో చాలామంది ఆపరేషన్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మించి పిల్లలు ఉన్నోళ్లు చదువులు, పోషణ భారమై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అనుకుంటే కష్టమేనంటూ కొందరు కు.ని. ఆపరేషన్లకు ముందుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కు.ని. ఆపరేషన్ల సంఖ్య బాగా తగ్గిపోయినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

కుటుంబ నియంత్రణ లక్ష్యాన్ని వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం

వచ్చిన వారికి మాత్రమే ఆపరేషన్లు

తాత్కాలిక గర్భనిరోధంపై అవగాహన

ప్రతి ఏటా తగ్గిపోతోన్న ఆపరేషన్ల సంఖ్య

జనాభా ఎక్కువైతే పోషణ భారం అవుతున్న రోజులని ప్రతి జంటకూ తెలియజేస్తున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులకు వచ్చే వాళ్లకు ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు అని సిబ్బంది తెలియజేస్తున్నారు. అయితే జనాభా నియంత్రణపై ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. కు.ని. ఆపరేషన్లు చేస్తున్నాం. కుటుంబ సభ్యుల అంగీకారం మేరకే ఆపరేషన్లు పూర్తవుతున్నాయి.

– ఫైరోజా బేగం,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement