26 మండలాల్లో వర్షం | - | Sakshi
Sakshi News home page

26 మండలాల్లో వర్షం

Sep 23 2026 1:07 AM | Updated on Sep 23 2026 1:07 AM

పుట్టపర్తి అర్బన్‌: తుపాను ప్రభావంతో జిల్లాలో వరుసగా మూడోరోజూ వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకూ జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 361.6 మి.మీ వర్షపాతం నమోదైందన్నారు. హిందూపురం మండలంలో 45.6 మి.మీ, చిలమత్తూరు 39.8 , బత్తలపల్లి 37.8, అమరాపురం 32.6, లేపాక్షి 25, నల్లచెరువు 24.6, గుడిబండ 23.2, పెనుకొండ 18.2, పరిగి 14.6, మడకశిర 12.8 మి.మీ వర్షం కురిసింది. అలాగే ముదిగుబ్బలో 12.4 మి.మీ, రొద్దం 12.4, సోమందేపల్లి 11.2, రొళ్ల 9.2, తనకల్లు 8.6, ధర్మవరం 6.2, సీకేపల్లి 5.2, గోరంట్ల 4.8, కనగానపల్లి 4.2, గాండ్లపెంట 3.2, కొత్తచెరువులో 2.4, అగళి 2, తాడిమర్రి, బుక్కపట్నం, రామగిరి, పుట్టపర్తి మండలాల్లో 1.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

కొత్తచెరువు కేంద్రంగా

జెడ్పీ కార్యకలాపాలు

అనంతపురం న్యూ టౌన్‌: కొత్తగా ఏర్పాటైన శ్రీ సత్యసాయి జిల్లా ప్రజా పరిషత్‌ పరిపాలన కార్యకలాపాలు ఈ నెల 25 నుంచి కొత్తచెరువు కేంద్రంగా ప్రారంభమవుతాయని ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్‌ సీఈఓ పి విజయలక్ష్మి తెలిపారు. తన చాంబర్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్తచెరువులోని ఎంపీడీఓ కార్యాలయంలో కొత్త జెడ్పీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు గమనించాలన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై

వివరాల సేకరణ

చిలమత్తూరు: ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు జర్మనీ నుంచి వచ్చిన కేఎఫ్‌డబ్ల్యూ బృందం మంగళవారం చిలమత్తూరు మండలంలో పర్యటించింది. ఇందులో భాగంగానే పాతచామలపల్లిలో రైతులతో ముఖాముఖి నిర్వహించి ప్రకృతి వ్యవసాయంపై వివరాలు సేకరించింది. కేఎఫ్‌డబ్ల్యూ సెక్టార్‌ ఎకనామిస్ట్‌ ఐరిస్‌ హార్డర్‌, అదే సంస్థకు చెందిన సీనియర్‌ ఎన్‌ఆర్‌ఎం స్పెషలిస్ట్‌ సంగీత అగర్వాల్‌ ఏపీసీఎన్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌, విశ్రాంత ఐఎఎస్‌ విజయ్‌కుమార్‌ రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం అమలు తీరు, రైతుల భాగస్వామ్యం, కార్యకలాపాలను తెలుసుకున్నారు. రైతు కృష్ణారెడ్డికి చెందిన 0.50 సెంట్లు భూమిలో మల్బరీ ఎ– గ్రేడ్‌ మోడల్‌ను వారి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ కన్సల్టెంట్‌ జి.మురళి, డీపీఎం లక్ష్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement