● ‘సర్’ ప్రత్యేక ఆధికారి శ్రీనివాసులు
ప్రశాంతి నిలయం: జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కార్యక్రమంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అధికారులు, సిబ్బంది జాగ్రత్త వహించాలని సర్ కార్యక్రమం జిల్లా ప్రత్యేక అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న తీరును ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిలమత్తూరు మండలం కోడూరు పోలింగ్ కేంద్రం 283, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గోరంట్ల మండలం పోలింగ్ కేంద్రం 247ను తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించి తగిన సూచనలు చేశారు. నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, కొత్త ఓటరు దరఖాస్తులు, తొలగింపులు, సవరణలపై వచ్చిన క్లెయిమ్‌లు, ఆధార పత్రాల సేకరణ, రిజిస్టర్ నిర్వహణను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌తో కలసి ఇఆర్‌ఓలు, ఏఇఆర్‌ఓలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్‌లో భాగంగా నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాల విచారణ శాతాన్ని పెంచి, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా వంద శాతం పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్‌ఓ లాగిన్‌లో అందుబాటులో ఉన్న విచారణ పత్రాలను పరిశీలించి, ఎక్కడ అస్పష్టతకు తావు లేకుండా పత్రాలు, ఆధారాలు స్పష్టంగా ఉన్నాయో లేదో నిర్దారించుకోవాలని సూచించారు.


