ఓడీచెరువు: మండల పరిధిలోని తిప్పేపల్లి చెరువులో టీడీపీ నేతలు మళ్లీ మట్టి దందాకు తెర తీశారు. ‘ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టం’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఆ ఒక్కరోజు మాత్రం మట్టి పనులను అక్రమార్కులు పక్కన పెట్టేశారు. అయితే మంగళవారం మళ్లీ యథావిధిగా తమ దందాను మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులందరూ ఏకమై మట్టి తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పనులను చేస్తున్న జేసీబీలను ఆపేందుకు ప్రయత్నించారు. గొడవ పెద్దది కావడంతో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకున్నారు. మట్టి తోలుతున్న వాహనాలను సీజ్ చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అయితే మట్టిని తరలించకుండా చూస్తామని ఆయన చేతులు దులుపుకున్నారు. కేవలం అధికార పార్టీ నేతలు మట్టి దందా చేస్తున్నందు వల్లనే వారిపై ఎలాంటి కేసులు పెట్టడం లేదని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తిప్పేపల్లి చెరువులో మళ్లీ మట్టి దందా
అడ్డుకున్న గ్రామస్తులు
తూతూ మంత్రంగా అధికారుల చర్యలు


