ప్రశాంతి నిలయం: వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు రైతులకు సంపూర్ణ భరోసా కల్పించాలని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో వర్షాల నేపథ్యంలో వ్యవసాయ ,అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ పొలాలను బీడుగా ఉంచకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంటల సాగుకు అవసరయ్యే విత్తనాలను రైతు సేవా కేంద్రాలలో సిద్ధంగా ఉంచాలన్నారు. రైతాంగానికి సంబంధించిన ప్రతి విషయం ఇక నుంచి రైతు సేవా కేంద్రం నుంచి పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువచేయాలని, ఏఐ సాంకేతికతను విస్తృతం చేయాలన్నారు. డ్వామా సహకారంతో ఖాళీ భూముల్లో భూసార రక్షణకు హాఫ్ మూన్ మోడల్ వర్క్‌ను ప్రోత్సహించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కృష్టయ్య, డ్వామా పీడీ విజయేంద్ర ప్రసాద్, పశుసంవర్థకశాఖ అధికారి బ్రహ్మవేద, పట్టు పరిశ్రమశాఖ అధికారి శోభారాణి, నీటిపారుదలశాఖ అధికారి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్


