ఆత్మకూరు: కొత్త పింఛన్ల కోసం సోమవారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి పలువురు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల వద్ద వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా ఆత్మకూరు మండల వ్యాప్తంగా 2 వేల మంది వరకు కొత్త పింఛన్లకు అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. కేవలం ఆత్మకూరులోనే 500 మందికి పైగా ఉన్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలియజేయడంతో సచివాలయాల వద్ద సోమవారం వారంతా బారులు తీరారు. అయితే, ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పని చేయకపోవడంతో వద్ద నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. సచివాలయ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 16 వరకే దరఖాస్తుకు అవకాశం ఉండటంతో అర్హులు ఆందోళనకు గురవుతున్నారు.
అయినవారు ఉన్నా అనాథలా మృతి!
పామిడి: అయినవారు పట్టించుకోకపోవడంతో మనసు చంపుకొని ఇల్లు వదిలివచ్చిన ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగుచూసింది. పామిడి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం ఈరన్నపల్లికి చెందిన చింతాకుల అశోక్(65) 25 ఏళ్ల క్రితం వ్యాపార రీత్యా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు వెళ్లి స్థిరపడ్డాడు. ఈయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురై 6 నెలల క్రితం ఇల్లు వదిలి వచ్చాడు. రెండు రోజులుగా పామిడి కమ్యూనిటీ ఆసుపత్రిలో తిరుగుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నిద్రించేవాడు. ఆదివారం రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచా డు. పామిడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుమారుడు, ప్రొద్దుటూరుకు చెందిన హరికృష్ణకు సమాచారం చేరవేశారు.
‘పీఎం విశ్వకర్మ’ కోసం ప్రత్యేక శిబిరాలు
ప్రశాంతి నిలయం: పీఎం విశ్వకర్మ పథకం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ వెంటనే పరిశీలించి రుణాలు మంజూరు చేసేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫణీంద్ర కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 8న ఉదయం 10.30 గంటలకు ధర్మవరం మండల మహిళా సమైక్య కార్యాలయంలో, మధ్యాహ్నం 3.30 గంటలకు పెనుకొండ మండల మహిళా సమైక్య కార్యాలయం, ఈనెల 9న ఉదయం 10.30 గంటలకు మడకశిర వెలుగు కార్యాలయం, మధ్యాహ్నం 3.30 గంటలకు హిందూపురం వెలుగు కార్యాలయం, ఈ నెల 10న ఉదయం 10.30 గంటలకు కదిరి ఎంపీడీఓ కార్యాలయం, మధ్యాహ్నం 3.30 గంటలకు పుట్టపర్తి డీఆర్‌డీఏ కార్యాలయంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు, చేతి వృత్తుల కళాకారులు, అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.


