కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి

Sep 8 2026 12:05 AM | Updated on Sep 8 2026 12:05 AM

ఈ నెల 16 వరకూ అవకాశం

ప్రశాంతి నిలయం: అర్హులై ఉండి ఇప్పటివరకూ సామాజిక పింఛన్‌ అందుకోలేని వారు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ఏ.శ్యాం ప్రసాద్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్టీఆర్‌ భరోసా కింద అందించే సామాజిక భద్రతా పింఛన్‌ పథకానికి నూతనంగా అర్హత పొందిన వారి నుంచి సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు తదితర వర్గాలకు చెందిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులు ఆధార్‌ కార్డు, రైస్‌ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, కేటగిరీ ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలని సూచించారు.

చీనీ మొక్కల ధ్వంసం

గుంతకల్లు రూరల్‌: మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మైనాపురం గ్రామంలో రైతు వెంకటేష్‌కు చెందిన తోటలోకి ఆదివారం రాత్రి దుందగులు చొరబడి చీనీ చెట్లను నరికివేశారు. రైతు వెంకటేష్‌ తన 9.5 ఎకరాల పొలంలో నాలుగు సంవత్సరాల క్రితం చీనీ తోట సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఏడాది మొదటికోతను తీయాలని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తోటలోకి జేసీబీతో చొరబడి మొక్కలపై ఇష్టారాజ్యంగా నడిపిస్తూ 200 మొక్కలను నాశనం చేశారు. ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు వెంకటేష్‌ చీనీ మొక్కలు నేలకు ఒరిగి ఉండటాన్ని గమనించి హతాశుడయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనాపురం గ్రామానికి చెందిన శేఖర్‌కు, తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, ఈ విషయంలో ఆదివారం అర్ధరాత్రి శేఖర్‌ తనకు ఫోన్‌ చేసి దుర్భాషలాడాడని బాధితుడు తెలిపాడు. శేఖర్‌ తన జేసీబీతో ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించాడు.

కరెంటు కోసం పడిగాపులు కాయాల్సిందేనా?

ఉరవకొండ: కరెంటు కోసం పొలాల వద్ద రేయింబవళ్లూ పడిగాపులు కాయాల్సిందేనా అని రైతులు విద్యుత్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిరప సాగు చేసుకోవడానికి విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ వెలిగొండ, బూదగవి గ్రామాల రైతులు సోమవారం ఉరవకొండలోని విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. రైతులు మాట్లాడుతూ బోరు బావుల కింద ఉన్న నీటితో మిరప నారు వేసుకుందామంటే అధికారులు రాత్రిపూట ఒక్కటే గంటపాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారన్నారు. ఈ కరెంటు కోసం ఎప్పుడు వదులుతారా అని పొలాల్లోనే ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. ఏఈ గురుమూర్తి ఆందోళనకారుల వద్దకు వచ్చి అధిక లోడు కారణంగా సమస్య ఏర్పడిందని, ఇక నుంచి సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement