బాఽధితులకు సత్వరమే న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

బాఽధితులకు సత్వరమే న్యాయం చేయాలి

Sep 8 2026 12:05 AM | Updated on Sep 8 2026 12:05 AM

ఎస్పీ సతీష్‌కుమార్‌

పుట్టపర్తి టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ సతీష్‌ కుమార్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సంబంధిత పోలీస్‌ అధికారులకు ఫోన్‌ చేసి ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకుని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అంకిత సురానా, సీఐలు బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికుడిపై కత్తితో దాడి

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని కేశవనగర్‌లో ఇంటి గోడ విషయంలో చేనేత కార్మికుడిపై పక్కింటి వారు కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం జరిగింది. వన్‌ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు... కేశవనగర్‌లో చేనేత కార్మికుడు శివానంద ఇంటి నిర్మాణం చేపట్టాడు. పక్క ఇంటి గోడకు బేల్దార్లు పొరపాటున రంధ్రాన్ని పెట్టారు. రంధ్రాన్ని పూడ్చివేస్తామని చెప్పినా వినకుండా పక్కింట్లో ఉన్న శివయ్య, అతని కుమారుడు వంశీలు గొడవ చేశారు. శివానందపై కర్రలతో దాడి చేసిన అనంతరం పిడి బాకుతో దాడికి దిగారు. స్థానికులు గమనించి వెంటనే గొడవను ఆపి గాయపడ్డ శివానందను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు శివానంద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘ఉద్యోగ సంఘాలతో

కంటితుడుపు చర్చలా?’

పుట్టపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో కేవలం కంటితుడుపు చర్చలు చేపట్టిందని వైఎస్సార్‌టీఏ విమర్శించింది. సోమవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి తదితరులు పుట్టపర్తిలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమైన సమస్య ఏ ఒక్కటీ కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. అయినా రెండు పెండింగ్‌ డీఏలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. పీఆర్‌సీపై ప్రభుత్వం మరో సారి మోసం చేసిందన్నారు. పీఆర్‌సీ కమిషన్‌ ఎప్పుడు ఏర్పాటు చేస్తోందో చెప్పలేదని విమర్శించారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయినా ఇంకా నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.

ఆటో బోల్తా.. వృద్ధుడి మృతి

ఉరవకొండ: ఆటో బోల్తా పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉరవకొండ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి గ్రామం నుంచి సోమవారం ఆటో ప్రయాణికులతో బయలుదేరింది. ఉరవకొండ సమీపంలో గొర్రెల మంద అడ్డురావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పీసీ ప్యాపిలి గ్రామానికి చెందిన అంజయ్య (70) తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ బాషాతో పాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్యకు భార్య తిప్పమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement