కదిరి టౌన్: టీడీపీ నేతల కబ్జాలతో కదిరిలో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతమవుతున్నాయి. తాజాగా కదిరి మున్సిపల్ పరిధిలోని సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లో ఎకరం విస్తీర్ణంలో వంకపోరంబోకు భూమిపై టీడీపీ నాయకుడు, కదిరి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కొమ్మినేని గంగయ్యనాయుడు కన్నేశాడు. వర్షాకాలంలో పైనుంచి వచ్చే నీరు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఉద్దేశించిన వంక భూమిని కబ్జా చేసేందుకు సిద్ధమయ్యాడు.
రూ.5 కోట్ల భూమిని
అప్పనంగా కొట్టేసేందుకు...
సైదాపురం పొలం గతంలో ఊరికి దూరంగా ఉండేది. కానీ కదిరి పట్టణం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండగా సైదాపురం మున్సిపాలిటీలో కలిసిపోయింది. 624, 625 సర్వే నంబర్లలోని పొలాలు పట్టణంలో కలిసిపోయాయి. ప్రస్తుతం కబ్జాకు గురైన భూమి వాణివీధిలోని శ్రీషిర్డిసాయిబాబా గుడి వెనుక వైపున ఉంది. ప్రభుత్వ రికార్డుల్లో వంకపోరంబోకుగా పేర్కొన్న భూమి విలువ సెంటు రూ.5 లక్షలపైనే ధర పలుకుతోంది. దీంతో సైదాపురం గ్రామానికి చెందిన కొమ్మినేని గంగయ్యనాయుడు ఆ భూమిపై కన్నేశాడు. స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అండతో కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మట్టితొలి చదును చేశాడు. త్వరలోనే ప్లాట్లు వేసి అమ్ముకోవాలని చూస్తున్నాడు. ఏకంగా రూ.5 కోట్ల విలువైన భూమిని టీడీపీ నాయకుడు కబ్జా చేసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన వంకపోరంబోకు భూమిని పూడ్చివేసి ప్లాట్లుగా మారిస్తే... భవిష్యత్‌లో వర్షపు నీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి పరిరక్షించాలని కోరుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు
ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తప్పవు. సైదాపురం పొలం సర్వే నంబర్ 624–1, 625లోని స్థలాన్ని సర్వే చేయిస్తాం. ఎవరైనా ఆక్రమించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– రెడ్డి శేఖర్, తహసీల్దార్, కదిరి
కదిరిలో మితిమీరిన
టీడీపీ నాయకుల భూకబ్జాలు
వంకను ఆక్రమించి మట్టితోలి
చదును చేసిన ఓ ‘తమ్ముడు’
రూ. 5 కోట్ల భూమికి ఎసరు పెట్టిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్
అధికార పార్టీ నాయకుడు కావడంతో కళ్లుమూసుకున్న అధికారులు


