అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు తెలిపారు. అనంతపురంలోని న్యాయ సేవా సదన్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థలో గురువారం ఆయన రెండు జిల్లాల ఎస్పీలు జగదీష్, సతీష్‌కుమార్‌తో సబీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను రాజీ చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి సత్యవాణి, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎన్.రాజశేఖర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ శైలజదేవి తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తిని ‘మోడల్’గా నిలుపుదాం
● ఉన్నతస్థాయి సమీక్షలో
కలెక్టర్ శ్యాంప్రసాద్
ప్రశాంతి నిలయం: ప్రజా ప్రతినిధులు, అధికారులు, సత్యసాయి భక్తుల సహకారంతో పుట్టపర్తిని ‘మోడల్’ ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పుట్టపర్తి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితో కలిసి కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పుట్టపర్తిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చెత్తరహిత, నీటి నిల్వరహిత పుట్టపర్తిగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం దృష్ట్యా రోడ్ల మీద ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే వివిధ దేశాల నుంచి పుట్టపర్తికి వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, పబ్లిక్ హెల్త్ డీఈ నరసింహమూర్తి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


