పేదలపై ధరల బాదుడేంది ‘బాబూ’..? | - | Sakshi
Sakshi News home page

పేదలపై ధరల బాదుడేంది ‘బాబూ’..?

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

ధర్మవరం: నిత్యావసరాల ధరలు నింగినంటడంతో సామాన్యులు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ‘బాదుడే బాదుడు’ అంటూ విష ప్రచారం చేసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారన్నారు. కానీ రెండేళ్లలో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలు పెరిగినా.. ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పట్టణంలోని పలు రిటైల్‌ కిరాణా మార్ట్‌లు, షాపులను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు పేద, మధ్య తరగతి ప్రజలతో మాట్లాడి నిత్యావసరాల ధరల పెరుగుదల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్రంలో, కేంద్రంలో కూటమే అధికారంలో ఉందని, ధరల పెరుగుదలపై ఎందుకు నియంత్రణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.

అనాలోచిత నిర్ణయాలతోనే ధరల పెరుగుదల

గతంలో బియ్యం కిలో రూ.55 ఉంటే, ప్రస్తుతం రూ.75కు పెరిగాయని, కందిపప్పు కిలో రూ.145 ఉంటే ప్రస్తుతం రూ.165కు చేరిందని కేతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వంట నూనెలు 30 శాతం దాకా పెరిగాయన్నారు. చక్కెర చూస్తే కిలో రూ.75 ఆల్‌టైం హైకి చేరిందన్నారు. టమాట నుంచి ఉల్లిగడ్డల వరకు సామాన్యులు కొనే పరిస్థితి లేదన్నారు. పోనీ ధరల పెరుగుదల వల్ల రైతులకు మద్దతు అయినా దక్కుతుందా అంటే అదీ లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే ధరలు పెరిగాయన్నారు. ఈ రెండేళ్లలో ధరల నియంత్రణకు కనీసం ఒక్క చర్య అయినా చేపట్టారా అని ప్రశ్నించారు.

ప్రజలు ఆలోచించాలి

ఎన్నికల వరకు ధరలు తగ్గిస్తామని హామీలు గుప్పించి... అధికారంలోకి వచ్చాక ధరలు పెంచిన చంద్రబాబు మోసపూరిత నైజాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. ఇటువంటి వారిని రాజకీయాల్లో మళ్లీ అబద్ధాలు చెప్పకుండా తగిన బుద్ధిచెప్పాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. ధరల తగ్గింపు కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబు రెండేళ్ల పాలనలో

విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement