● ధర్మవరం మోడల్ స్కూల్ టీచర్
శ్రావణికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ, వినూత్న బోధనా పద్ధతులతో విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న ధర్మవరం ఏపీ మోడల్ స్కూల్ ఫిజిక్స్ పీజీటీ సీవీ శ్రావణికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు–2026కు ఎంపిక చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేసిన కృషి, ఫిజిక్స్ లాంటి క్లిష్టమైన సబ్జెక్టును సైతం ఆసక్తికరంగా, సులభతరంగా బోధించిన విధానం ఆమెకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టింది.
సులభమైన బోధనతో విద్యార్థుల్లో ఆసక్తి..
ఫిజిక్స్ సబ్జెక్టులోని సూత్రాలు, సిద్ధాంతాలను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకుండా నిత్యజీవితంలోని ఉదాహరణలతో అనుసంధానం చేస్తూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం శ్రావణి ప్రత్యేకతగా నిలిచారు. క్లిష్టమైన అంశాలను చిన్నచిన్న భాగాలుగా విభజించి, ప్రయోగాలు, ప్రదర్శనలు, నమూనాలు, దృశ్యరూపకాలు, ప్రశ్నోత్తరాల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఆమె నిరంతరం కృషి చేశారు. విద్యార్థులు పాఠాన్ని కేవలం వినడం కాకుండా ఆలోచించడం, ప్రశ్నించడం, స్వయంగా పరిశీలించడం, ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం వంటి విధానాలకు ప్రాధాన్యం ఇచ్చారు. తరగతి గదిని చురుకై న అభ్యసన వేదికగా మార్చడంలో ఆమె చూపిన ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులు, సహచర ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు. బోధనను కేవలం ఉద్యోగ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేస్తున్న సీవీ శ్రావణి సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు– 2026కు ఎంపిక చేయడంపై విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


