ప్రశాంతి నిలయం: ‘‘రోజుల తరబడి మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం. మా సమస్య గురించి పట్టించుకునే వారే లేరు. మీరైనా కనికరించండి..సమస్యకు పరిష్కారం చూపండి’’ అంటూ జనం కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను వేడుకున్నారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. ప్రభుత్వ పథకాలు అందలేదని, భూమి కబ్జా చేశారని, రస్తా తగాదా తీర్చాలని..ఇలా పలు సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు.
ఇంటి స్థలం కబ్జా చేశారు..
పుట్టపర్తిలోని పెద్దకమ్మవారిపల్లి రోడ్డులో తన భూమిని ముస్లిం శ్మశాన వాటికకు తీసుకున్న రెవెన్యూ అధికారులు... శిల్పారామం కాలనీలో 3 సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేశారని పుట్టపర్తికి చెందిన అంజినప్ప తెలిపారు. అధికారులిచ్చిన స్థలంలో తాను పునాది సైతం వేశానన్నారు. కానీ ఇటీవల కొందరు వ్యక్తులు పునాదిని కూల్చేసి స్థలాన్ని కబ్ఞా చేశారని, వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని అని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిహారం ఇవ్వకుండా పేరు తొలగించారు..
పుట్టపర్తి మండలం కప్పలబండ రెవెన్యూ పొలంలో సర్వే నంబర్ 284–3, 284–4, 284–5తో తనకు 2 ఎకరాలుండగా, ఇటీవల టీడీపీ కార్యాలయం కోసం ఆ భూమిని ప్రభుత్వం కేటాయించిందని పుట్టపర్తి మండలం కప్పలబండకు చెందిన వీరాంజినమ్మ, రమేష్ కలెక్టర్‌కు తెలిపారు. అయితే తమ పేర్లు ఆన్‌లైన్‌లో తొలగించి ప్రభుత్వ భూమిగా చూపారని వాపోయారు. విచారణ జరిపించి పరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. లేదంటే తమ కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ కమ్యూనిటీ స్థలంలో
ప్రైవేట్ నిర్మాణాలు..
1984 సంవత్సరంలో పుట్టపర్తి సాయినగర్‌లోని కాలనీవాసుల సౌకర్యం కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కాంప్లెక్స్ నిర్మించారు, ఇప్పుడు పాతబడిన ఆ కాంప్లెక్సుకు మరమ్మతులు చేసి కమిటీ హాలుగా కానీ, పెళ్లి మండపంగా గానీ తయారు చేసుకోవాలని కాలనీ వాసులు తీర్మానం చేసుకున్నారని సాయినగర్‌కు చెందిన పుట్టపర్తి మాజీ వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, మాజీ కౌన్సిలర్ ఫొటో సాయి, ఎస్టీడీ నరసింహులు కలెక్టర్‌కు తెలిపారు. అయితే పుట్టపర్తిలోని కొందరు అధికార పార్టీ నాయకులు ఆ కాంప్లెక్స్‌ను పూర్తిగా కూల్చేసి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించేందుకు పూనుకున్నారని, వెంటనే చర్యలు తీసుకుని తమ కాలనీ వాసుల అవసరాలకే ఆ స్థలం వినియోగించి ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలన్నారు.
సహకార బ్యాంక్‌కు స్థలం కేటాయించండి
బుక్కపట్నంలో కోఆపరేటివ్ మహిళా బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు ఆర్డీటీ ముందుకొచ్చిందని, మండల కేంద్రంలో 5 సెంట్ల స్థలం కేటాయించాలని బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన మహిళలు సోమవారం రెవెన్యూ భవన్‌లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మహిళల అభ్యున్నతి కోసం ఆర్డీటీ సహకరిస్తోందని, తమకు స్థలం వెంటనే మంజూరు చేయాలని కోరారు. మహిళా సంఘం అధ్యక్షురాలు పద్మిని, కార్యదర్శి లక్ష్మీదేవి బాయి, సభ్యులు నారాయణమ్మ, విజయకుమారి, నాగలక్ష్మి, కాంతమ్మ, ఆర్డీటీ కోఆర్డినేటర్ కృష్ణయ్య కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
రైతాంగాన్ని ఆదుకోండి..
తీవ్ర వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు సోమవారం రెవన్యూ భవన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతు రుణమాఫీ ప్రకటించాలని, పశుగ్రాసం సరఫరా చేయాలని, తాగు, సాగు నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర డిమాండ్ చేశారు.
ప్రతి అర్జీకీపరిష్కారం చూపాలి : కలెక్టర్
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ‘పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్...అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. సామాజిక పింఛన్లు, ఇంటి స్థలాలు, ఇళ్లు, భూ సమస్యలు తదితర వాటిపై మొత్తంగా 224 అర్జీలు అందాయన్నారు. చాలా సమస్యలకు మండలంలోనే పరిష్కారం చూపవచ్చని, కానీ అక్కడి అధికారులు సరైన పద్ధతిలో చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రం వరకూ వస్తున్నారన్నారు. మండల అధికారులంతా ప్రతి సోమవారం ‘పరిష్కార వేదిక’ నిర్వహించాలని, ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, ఎస్‌డీసీ విజయకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
‘పరిష్కార వేదిక’కు
భారీగా విచ్చేసిన జనం
వివిధ సమస్యలపై
224 అర్జీలు అందజేత
సమస్యలు పరిష్కరించాలని
వేడుకున్న వైనం


