అగళి: నకిలీ రూ.500 నోట్లు ఇచ్చి ఓ కిరాణా దుకాణదారుడిని బురిడీ కొట్టించిన ఇద్దరిని అగళి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మడకశిర రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను మడకశిర సీఐ రాజ్‌కుమార్, ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపారు.
తండ్రీకొడుకు కలిసి..
కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరుకు చెందిన మహమ్మద్ అఫ్జల్, మైనర్ అయిన అతని కుమారుడు కలిసి అగళి మండలంలోని పలు గ్రామాల్లోని కిరాణాషాపుల వద్దకు వెళ్లి ఏదో వస్తువు కొనుగోలు చేసి రూ.500 నకిలీ నోటు ఇచ్చేవారు. అనంతరం కిరాణాషాపు నిర్వాహకుడు ఇచ్చే మిగతా మొత్తం తీసుకుని అక్కడి నుంచి ఉడాయించేవారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ఈనెల 14వ తేదీ (శుక్రవారం) మండల పరిధిలోని కార్పేపల్లి, నందరాజనపల్లి తదితర గ్రామాల్లో పర్యటించారు. రద్దీ ఎక్కువగా ఉండే కిరాణా దుకాణాల వద్దకు వెళ్లి పెట్రోలు, సిగరెట్లు, బెల్లం, షాంపులు. సబ్బులు, బిస్కెట్లు, గుట్కా ప్యాకెట్లు తదితర వాటిని కొనుగోలు చేసి రూ.500 నోటు ఇచ్చి చిల్లర తీసుకుని వెళ్లిపోయేవారు. ఈ క్రమంలోనే నందరాజనపల్లి గ్రామంలోని ఓ కిరాణాషాపులోనూ సరుకులు కొనుగోలు చేసి నకిలీ రూ.500 నోటు ఇచ్చారు. అయితే వెంటనే గుర్తించిన దుకాణం యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన దుండగులు ద్విచక్రవాహనంలో పారిపోతుండగా ఎస్‌ఐ రంగడు యాదవ్ వారిని వెంబడించి ఇరిగేపల్లి వద్ద ఉన్న మైరాడా బిల్డింగ్ వద్ద పట్టుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించి విచారించారు. వారి వద్ద నుంచి 44 రూ.500 నకిలీ నోట్లతో పాటు రూ.5,700 విలువైన ఒరిజినల్ రూ.100 నోట్లు, కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేసిన సరుకులు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరికి నకిలీ నోట్లు ఎలా వచ్చాయి... ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రాజ్‌కుమార్ తెలిపారు. ఎవరైనా అపరిచితులు చిల్లర కోసం అడిగినప్పుడు నోట్లను జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని, నకిలీ కరెన్సీ నోట్లు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిబ్బంది లక్ష్మీకాంత, పురుషోత్తం, వెంకటరామిరెడ్డి, వెంకటేశ్ పాల్గొన్నారు .
నకిలీ నోట్లు, బైక్ స్వాధీనం
దుండగులిద్దరూ కర్ణాటక వాసులు


