ప్రశాంతి నిలయం: యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి, దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కోసం కేంద్రం అందుబాటులోకి తెచ్చిన ‘మై భారత్ పోర్టల్’లో అర్హులు తప్పని సరిగా రిజిస్టర్ చేసుకోవాలని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ సూచించారు. సోమవారం రెవెన్యూ భవన్‌లో ‘మై భారత్ పోర్టల్’ నమోదుపై జిల్లా సలహా మండలి సమావేశాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు కలిగిన యువత పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవడానికి అర్హులన్నారు. కెపాసిటీ బిల్డింగ్, నైపున్యాభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలు, శిక్షణ అవకాశాల సమాచారం, పోర్టల్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి ఐసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రణాళికలు సిద్ధం చేయండి..
ఈ నెల 19, 20 తేదీల్లో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని, ఆ లోపు వ్యవసాయ, అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలకు సంబంధించిన అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలని ప్లానింగ్ అధికారులను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం ప్లానింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎంఎస్‌ఎంఈ యజమానులు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలతో సమావేశమవుతారన్నారు. వారి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సత్యసాయికి
సంగీత నీరాజనం
ప్రశాంతి నిలయం: సత్యసాయిని కీర్తిస్తూ నవరసాలను పంచుతూ ‘హృదయ్ వీణ’ పేరుతో నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన ఒడిశా సత్యసాయి భక్తులు సత్యసాయికి సంగీత నీరాజనాలు అర్పించారు. సోమవారం సాయికుల్వంత్ సభా మందిరంలో సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి స్వరాలతో నిర్వహించిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
మందుబాబుకు
ఏడు రోజుల జైలు
తలుపుల : పూటుగా మద్యం సేవించి బైక్‌పై దూసుకెళుతూ పోలీసులకు పట్టుబడిన ఓ మందుబాబుకు కోర్టు ఏడు రోజుల జైలుశిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే...మండల కేంద్రానికి చెందిన నాగిన్ బాషా ఆదివారం రాత్రి శివారు ప్రాంతంలో పూటుగా మద్యం సేవించి బైక్‌పై తలుపులకు వస్తున్నాడు. అదే సమయంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా...వారికి దొరికిపోయాడు. దీంతో పోలీసులు సోమవారం నాగిన్‌బాషాను కదిరి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచగా...జడ్జి ఏడు రోజులు జైలుశిక్ష విధించారు. దీంతో అతన్ని కదిరి సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు. ఎవరైనా సరే మద్యం తాగి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్ష ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.


