హిందూపురం/లేపాక్షి: ఐదుగురు దొంగలను హిందూపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో సీఐ జనార్ధన్ వివరాలు వెల్లడించారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన కె.ఆదినారాయణ, సింహాద్రి, కర్ణాటక రాష్ట్రం చించనహళ్లికి చెందిన సీఎన్ మంజునాథ్, డి.పాళ్యంకు చెందిన రాజేష్, దారినాయకనపల్లికి చెందిన త్రినేజ్‌లు జల్సాలకు అలవాటు పడ్డారు. వీరంతా బృందంగా ఏర్పడి ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వస్తువులు, నగదు లాక్కునేవారు. లేపాక్షి పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 25న సిరివరం– మనేంపల్లి చెరువు మార్గంలో షామీర్ అనే వ్యక్తిని బెదిరించి అతని వద్ద రూ.4,200 నగదుతో పాటు ఒప్పో ఫోన్ లాక్కున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకునేందుకు హిందూపురం ఏఎస్పీ మహేష్ పర్యవేక్షణలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం లేపాక్షి సమీపంలో దొంగల ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు వాహనాలు, రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్‌ఐ నరేంద్ర, సిబ్బందిని సీఐ జనార్ధన్ అభినందించారు.


