పుట్టపర్తి టౌన్: దేశ రక్షణ కోసం సరిహద్దులో మురళీనాయక్ చేసిన ప్రాణత్యాగం రాబోవు తరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ కొనియాడారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన అమర జవాన్ మురళీనాయక్ జ్ఞాపకార్థం అతని విగ్రహాన్ని పుట్టపర్తిలోని శిల్పారామంలో ఏర్పాటు చేశారు. నూతన విగ్రహాన్ని సోమవారం కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ జవాన్ తల్లిదండ్రులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవాన్ మురళీనాయక్ తల్లిదండ్రులను శాలువతో సన్మానించారు. అనంతరం దేశ భక్తిగీతాలకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ బలగాలు దీటుగా ఎదుర్కొనే క్రమంలో 2025 మే 9వ తేదీన మురళీనాయక్ ప్రాణ త్యాగం చేశారన్నారు. అతి చిన్న వయస్సుల్లోనే దేశం కోసం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి రాబోవు యువతరాలకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయన్నారు. అమర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. అనంతరం ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ, మాతృభూమి రక్షణకోసం ప్రాణాలర్పించిన మురళీనాయక్ అమరత్వం అమూల్యమైందన్నారు. సరిహద్దుల్లో సైనికుల ప్రాణాలకు తెగించి కాపాలా ఉండటం వల్లే మనమందరం సురక్షితంగా ఉంటున్నామన్నారు. మురళీనాయక్ వీరత్వాన్ని ప్రతి భారతీయుడు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, జిల్లా డైరెక్టర్ రజాక్‌ఖాన్, ఆర్డీఓ సువర్ణతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్మీ ప్రతినిధులు, అమరజవాన్ కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అమరవీరునికి శ్రద్ధాంజలి ఘటించారు.
విగ్రహావిష్కరణలో కలెక్టర్
శ్యాంప్రసాద్, ఎస్పీ సతీ్‌ష్‌కుమార్


