నేడు పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు పరిష్కార వేదిక

Aug 10 2026 1:52 AM | Updated on Aug 10 2026 1:52 AM

ప్రశాంతి నిలయం: పుట్టపర్తి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. meekosam. ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మునిసిపల్‌, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోలీస్‌ కార్యాలయంలో ..

పుట్టపర్తి టౌన్‌: పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. తమ ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

కదిరి టౌన్‌: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీషీటర్‌ షేక్‌ ముజాహిద్‌ (ముజ్జు)పై ఆంధ్రప్రదేశ్‌ డేంజరస్‌ యాక్టివిటీస్‌ చట్టం– 1986 ప్రకారం నిర్బంధ ఉత్తర్వులు (పీడీ యాక్ట్‌) జారీ చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. ఆదివారం కదిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో సీఐ బి.వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. కదిరి పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన షేక్‌ ముజాహిద్‌పై రెండేళ్లలో 7 కేసులు నమోదయ్యాయన్నారు. అయినా నేరప్రవృత్తి వీడలేదన్నారు. ఇటీవల మళ్లీ ప్రజల్లో భయాందోళన కలిగించే విధంగా వ్యవహరించినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్‌ అమలు చేయాలని కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు తెలిపారు. కదిరిలో గతంలో నలుగురిపై పీడీ యాక్ట్‌ అమలు చేసి కడప జైలుకు తరలించినట్లు వెల్లడించారు. రౌడీషీటర్లు పదే పదే నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు ఇంజినీరింగ్‌

విద్యార్థినుల అదృశ్యం

అనంతపురం సెంట్రల్‌: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అనంతపురంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు జేఎన్‌టియూలో చదువుతున్నారు. నాలుగురోజుల క్రితం కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా ఇలాంటి ఘటనల్లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ముగ్గురు విద్యార్థినులు మాత్రమే వెళ్లారని, ఇందులో ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని తెలిసింది. దీంతో జేఎన్‌టీయూ కాలేజీలో ఏవైనా ఇబ్బందులున్నాయా, మరే ఇతరత్ర సమస్యలతో వెళ్లారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కాగా ముగ్గురు విద్యార్థినుల్లో ఒకరు తిరిగి వచ్చినట్లు సమాచారం. అయితే దీన్ని ఇంకా ధ్రువీకరించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement