ధర్మవరం అర్బన్: వ్యక్తిని హతమార్చి చెరువులో పడేసిన ఘటన ధర్మవరంలో కలకలం రేపింది. వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప తెలిపిన మేరకు.. ధర్మవరం మండలంలోని ఓబుళనాయనపల్లికి చెందిన బోయ దాసరి శ్రీనివాసులు (40) కొంత కాలంగా పట్టణంలోని ఎరగుంటలో నివసిస్తున్నాడు. ఇతనికి భార్య భవాని, ముగ్గురు కుమారులు ఉన్నారు. శ్రీనివాసులు తమ గ్రామ సమీపంలో భూమి కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. ఆయనకు 10 రోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయమై పలువురితో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మూడురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసులు తిరిగి రాలేదు. ఆదివారం ధర్మవరం చెరువులోని రెండో మరువ వద్ద శవమై తేలాడు. ఎక్కడో హత్య చేసి చెరువులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ జగన్నాథ్‌రాజు, వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ సీఐ జయనాయక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. శ్రీనివాసులుతో ఆర్థిక లావాదేవీల విషయమై గొడవ పడిన వారితో పాటు పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
ధర్మవరంలో కలకలం రేపిన వ్యక్తి హత్య


