గోరంట్ల: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరంట్ల పట్టణంలో ఆదివారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన, ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కక పోవడం అన్యాయమన్నారు. అర్హులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, అదే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ హాస్టల్ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అక్రమాలకు కేరాఫ్ మంత్రి సవిత
మంత్రి సవిత బీసీ పిల్లలపై కపట ప్రేమ కనబరుస్తున్నారని ఉషశ్రీచరణ్ విమర్శించారు. పెనుకొండ నియోజకవర్గంలోని రాంపురంలో తన సోదరుడికి లబ్ధి చేకూర్చేందుకు బీసీ సంక్షేమ పాఠశాల ఏర్పాటు చేయించారని ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటక రాష్ట్రంలోని పావగడ, దొమ్మితిమర్రి నుంచి కియో కంపెనీకి తన అనుచరులతో అక్రమంగా డీజిల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో ఒక బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే 20 రూపాయల మేర అదనంగా అమ్మిస్తూ నెలకు రూ. 50 కోట్లకు పైగా దోచేస్తున్నట్లు ఆరోపించారు. రొద్దం, పరిగి, గోరంట్ల మండలాల నుంచి అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కంకర మిషన్లతో దోపిడీ చేస్తున్నారన్నారు. అవినీతిలో ముందంజలో ఉన్న ఆమె ప్రజల మన్ననలను పొందడంలో కూడా వెనుకబడిందని సర్వేలో ఇప్పటికే తేటతెల్లమైందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలిన సవితకు ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అర్హులైన అభ్యర్థులకు
న్యాయం జరిగే దాకా పోరాటం
అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


